దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. భారీ తుఫాను కారణంగా పెట్రోల్ పంపు దగ్గర హోర్డింగ్ కూలి 14 మంది మరణించారు. 74 మంది తీవ్రంగా గాయపడ్డారు.
44 మంది BMC లోని రాజావాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. NDRF రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఈ యాక్సిడెంట్ తర్వాత రకరకాల షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రమాదం సంభవించిన హోర్డింగ్ పేరు ‘లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో నమోదైంది. ఇది ముంబైలో అతిపెద్ద హోర్డింగ్‌గా ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నమోదైంది.
ఈ ప్రమాదం తర్వాత హోర్డింగ్ యజమానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ విషయంలో అనేక షాకింగ్ విషయాలు కూడా వెల్లడవుతున్నాయి. ఘట్‌కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంప్ సమీపంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ అక్రమమని పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు ఈ విషయం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు ముందే తెలుసు.
BMC ప్రకారం 40X40 అడుగుల పరిమాణంలో హోర్డింగ్‌లు పెట్టడానికి అనుమతి ఇచ్చారు. సోమవారం జరిగిన ప్రమాదం తర్వాత హోర్డింగ్ సైజు 120X120 అడుగులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అంతే కాదు కేసు దర్యాప్తులో ఆ హోర్డింగ్ అందరికి కనిపించేందుకు చుట్టుపక్కల చెట్లకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి ఎండబెట్టినట్లు కూడా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
నిబంధనలను ఉల్లంఘించినందుకు హోర్డింగ్‌లను నిర్వహించే ఏజెన్సీ అయిన ఇగో మీడియాపై మున్సిపల్ కార్పొరేషన్ ట్రీ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ డిసెంబర్ 2023లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. BMC అధికారులు రెండు వారాల క్రితం ఏప్రిల్‌లో పోలీసులను సంప్రదించారు. ఈ విషయమై పోలీసులు ఫిర్యాదు కూడా నమోదు చేశారు. అక్రమ హోర్డింగ్‌ల దగ్గర ఉన్న చెట్లు ఒక్కసారిగా ఎండిపోయి చనిపోయాయని పోలీసులకు అందిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని వెనుక ఎవరి కుట్రో ఉందని పేర్కొన్నారు.
తూర్పు ఎక్స్‌ప్రెస్‌వేపై చెట్లు కూలిన సంఘటనలు రెండు వేర్వేరుగా ఉన్నాయని BMC తెలిపింది. మొదటి సంఘటన గతేడాది డిసెంబర్‌లో జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ చెట్ల వేర్లకు రంధ్రాలు చేసి విషం పోసినట్లు విచారణలో తేలింది. ఎండిన చెట్లను నరికేందుకు వీలుగా ఈ ప్రయోగం చేసినట్లు వెల్లడించారు.
మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ భూషణ్ గాగ్రానీ మాట్లాడుతూ పెద్ద హోర్డింగ్‌లు ప్రజలకు దూరం నుంచే కనిపించేలా చేసేందుకు చేదానగర్ జంక్షన్ ప్రాంతంలో 8 చెట్లకు విషాన్ని ఇంజెక్ట్ చేశారు. ఈ విషయమై బీఎంసీ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అదే సమయంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం తరువాత పోలీసులు, BMC విభాగాలు మళ్లీ మేల్కొన్నాయి. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ హోర్డింగ్‌లను నిర్వహిస్తున్న సంస్థ ఇగో మీడియా యజమాని భవేష్ భిడేపై పంత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ మీడియా సంస్థకు చెందిన మరో మూడు హోర్డింగ్‌లను తొలగించాలని మున్సిపాలిటీ నోటీసు జారీ చేసింది. దీంతో వెంటనే మూడు హోర్డింగ్‌లను తొలగించే ప్రక్రియను ప్రారంభించారు.
దీనితో పాటు GRP కమీషనర్ రవీంద్ర షిస్వే, ఈ విషయంపై వెంటనే దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైల్వే భూముల్లో హోర్డింగ్‌లు పెట్టేందుకు అనుమతి ఎప్పుడు, ఎవరి ద్వారా ఇచ్చారు? నిబంధనలు పాటించారా లేదా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..