పామును చూస్తేనే కొందరు భయంతో పరిగెడతారు. ప్రమాదవశాత్తు పాము కాటేసినప్పుడు సమయానికి వైద్యం అందక చాలామంది మృతి చెందిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయితే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో పాముల బెడత కలకలం రేపుతోంది. 17 నెలల్లోనే అక్కడ వెయ్యికి పైగా పాము కాటు కేసులు నమోదయ్యాయి. పాము కాటుకు గురైన వారిలో సుమారు 14 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు జరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా అలిబాగ్, పాన్వెల్, ఖలాల్‌పూర్, మహద్ లాంటి ప్రాంతల్లో ఈ ప్రమాదాలు ఎక్కవగా జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.
ఎవరైన పాము కాటుకు గురైనప్పుడు.. వారిని మంత్రాలు చేసేవారు, నాటు వైద్యం చేసేవారి దగ్గరికి వెళ్లకుండా వెంటనే సమీపంలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని 14 ప్రాంతాల్లో పాము కాటుకు వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా.. పాము లేదా తేలు కాటుతో ఎవరైనా రైతులు మరణిస్తే వారి కుటుంబీకులకు మాత్రమే పరిహారం ఇస్తున్నారని.. ఇతరులు కూడా ఎవరైనా వీటివల్ల చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కూడా పరిహారం అందించాలంటూ గతంలో బాంబే హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..