మండే ఎండల్లో చల్ల.. చల్లగా.! అనుకున్న సమయానికంటే ముందే.. ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు..

|

Apr 16, 2024 | 8:11 AM

రాబోయే రెండు నెలలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తుంది వాతావావరణ శాఖ. దాదాపు 50డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈ ఏడాది సాదారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని గుడ్ న్యూస్ చెప్పింది IMD.

మండే ఎండల్లో చల్ల.. చల్లగా.! అనుకున్న సమయానికంటే ముందే.. ఈ ఏడాది వర్షాలే.. వర్షాలు..
Rains
Follow us on

దేశ వ్యాప్తంగా ఈ ఏడాది ఎండలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా అసాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. మార్చి నుంచే ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల దాటితే ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి. ఇక, మధ్యాహ్నం అయితే నిప్పుల కొలిమిని తలపిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. రాబోయే రెండు నెలల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణ శాఖ అంచానాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఐక్యరాజ్యసమితి సైతం పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జాగ్రత్తగా ఉండాలనిసూచిస్తుంది. ఈఎండలు పిల్లల ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించింది. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో పెరిగే ఉష్ణోగ్రతల ఎఫెక్ట్ కారణంగా దాదాపు 25 కోట్ల మంది చిన్నారులకు ముప్పు పొంచి ఉందని పేర్కొంది. ఎల్ నినో పరిస్థితుల కారణంగా 2023లో సగటు వర్షపాతం 868 మి.మీ కంటే తక్కువగా 820 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఇదేక్రమంలో IMD రుతుపవనాలపై చల్లటి కబురు చెప్పింది. దేశంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు సమయానికి ముందే రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు భారతదేశంలో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, దీర్ఘకాల సగటు 87 సెం.మీ కంటే 106 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు.

జూన్‌ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని అధికారులు వెల్లడించారు. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్‌ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జూలై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున నైరుతి రుతుపవనాల రెండో భాగంలో మంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. హిందూ మహాసముద్రం డైపోల్, లానినా పరిస్థితులు ఒకే టైంలోవేగంగా మారడంతో రుతుపవనాలు త్వరగానే వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై అనుకూల దశను సూచిస్తున్న రుతు పవనాలు పసిఫిక్‌లో లానినా ఏర్పడటానికి సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తున్నట్లు తెలిపారు.

దీని కారణంగా దేశంలో జులై నుంచి సెప్టెంబరు వరకు గరిష్ట రుతుపవన పరిస్థితులను పెంచుతుందన్నారు వాతావరణశాఖ అధికారులు. పశ్చిమ, వాయువ్య భారత్, ఉత్తర అరేబియా సముద్రంలో రుతుపవనాల అల్పపీడనాలు లేదా అల్పపీడనాలు విస్తరించి, స్థిరంగా వర్షాలను కురిపిస్తాయని అంచనా వేస్తున్నారు. వర్షపాతం పెరుగుతుందని సూచిస్తుంది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు భారతదేశ వార్షిక వర్షపాతంలో 70 శాతం అందిస్తుంది, ఇది వ్యవసాయ రంగానికి కీలకం. దేశ జిడిపిలో వ్యవసాయం వాటా 14 శాతంగా ఉంది.