Mumbai Heavy Rains: ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. నీట మునిగిన రైల్వే ట్రాక్‌లు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

|

Jun 09, 2021 | 11:47 AM

కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబైని భారీ వర్షాలు చిగురుటాకులా వణికిపోయేలా చేస్తున్నాయి.

Mumbai Heavy Rains: ముంబైను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. నీట మునిగిన రైల్వే ట్రాక్‌లు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
Mumbai Heavy Rains
Follow us on

Monsoon Arrives In Mumbai Heavy Rains: కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబైని భారీ వర్షాలు చిగురుటాకులా వణికిపోయేలా చేస్తున్నాయి. ఎడతెరపి లేని వానతో దేశ ఆర్థిక రాజధాని తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లు నీట మునిగాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. రైళ్ల రాకపోకలను కూడా చాలా వరకు నిలిపేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో మహారాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగులందరూ తక్షణమే ఇళ్లకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేసింది.

రుతుపవనాలు ముందుగానే ప్రవేశించడంతో వానలు జోరందుకున్నయి. నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వానతో ముంబై నీట మునిగింది. రోడ్లపై భారీగా వరదనీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. వరదనీరు అంతకంతకు పెరుగుతోంది. మోకళ్లలోతు నీళ్లతో జనం ఇబ్బంది పడుతున్నారు. కొంకణ్ తీర ప్రాంతం అయితే వాన, వరదతో వణికిపోతుంది. థానే, రాయ్‌గఢ్‌, పుణె, బీడ్ ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. మరో ఐదు రోజుల పాటు వర్షాలుంటాయని.. రాబోయే 48 గంటల్లో అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వాతావరణశాఖ హెచ్చరికలతో నగరవాసుల్లో టెన్షన్ మొదలైంది. 2005 జులై 26న ముంబై నగరాన్ని వరదలు ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. మళ్లీ అలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందా అన్న ఆందోళన మొదలైంది. అధికార యంత్రాంగం మాత్రం అన్ని రకాలుగా అప్రమత్తమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.


Read Also…  Telangana Rains: రాష్ట్రాన్ని ముందే పలకరించిన రుతుపవనాలు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. వరంగల్ లోతట్టు ప్రాంతాలు జలమయం