Video: తప్పతాగి.. బట్టలిప్పి.. నడిరోడ్డుపై రాజకీయ నేత కుమారుడి వీరంగం! ఓ మహిళపై..

ముంబైలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్ఎస్) నేత కుమారుడు రహిల్ షేక్ మద్యం సేవించి అర్ధనగ్నంగా రోడ్డుపై అల్లర్లు చేశాడు. ఒక మహిళను దుర్భాషలాడాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఎమ్మెన్ఎస్ పార్టీ అతని ప్రవర్తనకు దూరం పాటిస్తోంది. ఈ ఘటన సామాజిక అన్యాయాన్ని ఎలివేటు చేసింది.

Video: తప్పతాగి.. బట్టలిప్పి.. నడిరోడ్డుపై రాజకీయ నేత కుమారుడి వీరంగం! ఓ మహిళపై..
Raheel Shaik

Updated on: Jul 07, 2025 | 5:51 PM

డబ్బు మదమో లేక అధికార అహంకారమో తెలియదు గానీ, కొంతమంది పిచ్చి ప్రవర్తనతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఓ రాజకీయ నేత కుమారుడు నడిరోడ్డుపై అర్ధనగ్నంగా వీరంగం సృష్టించాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS)కు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడు ఈ హంగామా చేశాడు. ఘటనకు సంబంధించిన వీడియో సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బాగా తప్పతాగి కారులో అర్ధనగ్నంగా కూర్చుని ముంబైలో మరాఠీ మాట్లాడే మహిళను దుర్భాషలాడుతున్నట్లు వీడియోలో చూడొచ్చు. ఆ యువకుడు MNS రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావేద్ షేక్ కుమారుడు రహిల్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. మహిళలను దుర్భాషలాడటం, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వంటి నేరాల కింద అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ యువకుడి అరెస్ట్‌పై MNS నాయకుడు అవినాష్ జాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “అతని చర్యలకు MNS మద్దతు ఇవ్వడం లేదు, అతనిపై పోలీసు చర్య తీసుకోవాలని పార్టీ డిమాండ్ చేస్తోంది” అని అన్నారు. రహిల్‌ రచ్చను వీడియో తీసిన మహిళ రాజ్‌శ్రీ మోర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. మహారాష్ట్రకు చెందిన మోర్, గతంలో మాతృభాష కాని వారిపై మరాఠీ విధించడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన వీడియోతో వార్తల్లో నిలిచారు. మరాఠీని విధించే బదులు, స్థానిక మరాఠీ ప్రజలకు కష్టపడి పనిచేయడం నేర్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి