
మథుర, ఆగస్ట్ 9: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో దారుణ ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధాన్ని భర్త ప్రశ్నించడంతో ఓ మహిళ అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. కుమార్తె, ఆమె ప్రియుడి సహాయంతో మృతదేహాన్ని అడవిలోకి తరలించి దహనం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మథురకు చెందిన నైనా (40) తన భర్త మనోజ్ సోనీ (42)తో కలిసి జీవిస్తోంది. నైనా కుమార్తె భక్తికి విమల్ చౌధరి (22) అనే యువకుడితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు మనోజ్ గుర్తించాడు. ఈ విషయమై కుమార్తెను మందలించడంతోపాటు భార్యతోనూ మనోజ్ గొడవపడ్డాడు.
ఈ క్రమంలోనే నైనా తన భర్తను హత్య చేసేందుకు పథకం వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా మత్తుమందు కలిపిన పాలను మనోజ్‌కు ఇచ్చినట్లు సమాచారం. అతడు గాఢంగా నిద్రలోకి వెళ్లిన తర్వాత బండరాయితో తలపై బలంగా కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కుమార్తె భక్తి, ఆమె ప్రియుడు విమల్ సహాయంతో మృతదేహాన్ని యమునా నది తీరంలోని అటవీ ప్రాంతానికి తరలించారు. అక్కడ ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని తగులబెట్టినట్లు పోలీసులు తెలిపారు.
భర్త కనిపించడం లేదంటూ నైనా ఏప్రిల్ 21న పోలీసులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేయించింది. అయితే మరుసటి రోజే ఎలాంటి కారణం చెప్పకుండా ఫిర్యాదును ఉపసంహరించుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అల్లుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుండగా, కుమార్తె భక్తిలో మాత్రం ఎలాంటి కలవరం కనిపించకపోవడాన్ని ఆమె తండ్రి బ్రజ్‌మోహన్ గమనించాడు. దీంతో అనుమానం వచ్చిన ఆయన కుమార్తెను నిలదీశాడు. ఈ క్రమంలో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. వెంటనే బ్రజ్‌మోహన్ ఈ విషయాన్ని మనోజ్ సోనీ బంధువులతోపాటు పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నైనా, భక్తి, విమల్ చౌధరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన వస్తువులు, మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతం తదితర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.