గడ్చిరోలి అడవుల్లో భారీ మావోయిస్టు డంప్ పట్టివేత.. ఆయుధాలు, గ్రెనేడ్లు, పేలుడు సామగ్రి సీజ్!
మహారాష్ట్ర: గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, వారు గతంలో రహస్యంగా దాచిపెట్టిన ఆయుధాలు, పేలుడు సామగ్రి డంప్‌లు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా గడ్చిరోలి జిల్లా గర్దేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిక్కేర్ అటవీ ప్రాంతంలో పోలీసులు భారీ మావోయిస్టు డంప్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో ఆయుధాలతో పాటు గ్రెనేడ్లు, బీజీఎల్ లాంచర్లు, డిటోనేటర్లు, ఇతర పేలుడు సామగ్రి బయటపడటం కలకలం రేపింది.

నవంబర్ 17న జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. రమేష్ మార్గదర్శకత్వంలో పోలీసులు ప్రత్యేక సోదాలు నిర్వహించారు. హిక్కేర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఆయుధాలు, పేలుడు పదార్థాలను భూమిలో రహస్యంగా పాతిపెట్టి ఉంచినట్లు అందిన సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో ప్రాణహితకు చెందిన ఐదు ప్రత్యేక బృందాలు, బాంబు నిర్వీర్య దళం (BDDS)కు చెందిన రెండు బృందాలు రంగంలోకి దిగి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. అనుమానాస్పద ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి భూమిలో దాచిన డంప్‌ను గుర్తించాయి.
భారీగా ఆయుధాలు, పేలుడు సామగ్రి స్వాధీనం
ఈ ఆపరేషన్‌లో ఒక 12 బోర్ రైఫిల్, ఒక ఎయిర్ గన్ రైఫిల్, 303 రకం 13 లైవ్ బుల్లెట్లు, 8 ఎంఎం రకం 18 లైవ్ బుల్లెట్లు, మూడు గ్రెనేడ్లు, 18 బీజీఎల్ సెల్స్, రెండు బీజీఎల్ లాంచర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 10 డిటోనేటర్లు, 21 సురాకా సెల్స్, హోండా కంపెనీకి చెందిన ఒక ఎలక్ట్రిక్ జనరేటర్, 22 వైర్ బండిల్స్‌తో పాటు భారీగా ఇతర మావోయిస్టు సామగ్రిని పోలీసులు సీజ్ చేశారు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఆపరేషన్
జిల్లా ఎస్పీ ఎం. రమేష్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీలు కార్తిక్ మధీర, గోకుల్ రాజ్ జీ, అహేరి (ప్రాణహిత) అదనపు ఎస్పీ హర్షవర్ధన్ బి.జె., డీఎస్పీ (ఆపరేషన్స్) సునీల్ ఉయికే పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. గడ్చిరోలి ప్రత్యేక ఆపరేషన్ బృందాలు, ప్రాణహిత బృందాలు, ఇంటెలిజెన్స్ సెల్, బాంబు నిర్వీర్య దళం సిబ్బంది సమన్వయంతో ఈ సోదాలు నిర్వహించారు.
ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసు సిబ్బందిని ఎస్పీ ఎం. రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు గతంలో దాచిన ఆయుధాలు, పేలుడు సామగ్రిని గుర్తించేందుకు పోలీసులు చేపడుతున్న సోదాల్లో ఈ డంప్ పట్టుబడటం కీలక పరిణామంగా భావిస్తున్నారు. గడ్చిరోలి అటవీ ప్రాంతాల్లో మరిన్ని రహస్య డంప్‌లు ఉన్నాయా అనే కోణంలోనూ భద్రతా బలగాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..