Marathi Quota Protest: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్‌స్టాప్.. దీక్ష విరమించిన మనోజ్ జరాంగే

Manoj Jarange Patil: మరాఠా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్‌స్టాప్‌ పడింది. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. డిమాండ్లను నెరవేరుస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరాఠా రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే తన ఆందోళనను విరమించారు.

Marathi Quota Protest: మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్‌స్టాప్.. దీక్ష విరమించిన మనోజ్ జరాంగే
Maratha quota activist Manoj Jarange Patil

Updated on: Jan 27, 2024 | 11:23 AM

మరాఠా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్‌స్టాప్‌ పడింది. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. డిమాండ్లను నెరవేరుస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరాఠా రిజర్వేషన్‌ ఉద్యమ నాయకుడు మనోజ్ జరాంగే పాటిల్ తన ఆందోళనను విరమించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే నవీ ముంబైలోని దీక్షా శిబిరానికి చేరుకుని మనోజ్ జరాంగే‌కి పళ్ల రసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. అలాగే, రిజర్వేషన్లపై ప్రభుత్వ హామీలకు సంబంధించిన పత్రాన్ని జరాంగేకు CM షిండే అందించారు. అనంతరం సీఎం ఏక్‌నాథ్ షిండే, మనోజ్ జరాంగే ఇద్దరూ కలిసి నవీ ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దీక్ష విరమించిన మనోజ్ జారంగే పాటిల్..

వాస్తవానికి మరాఠా రిజర్వేషన్లను శనివారం ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వానికి మనోజ్ జరాంగే అల్టిమేటం ఇచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో ముంబై నగరాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆజాద్ మైదాన్ దగ్గర ఆందోళనకు మరాఠా ఉద్యమకారులు ఏర్పాట్లు చేసుకున్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందించకుంటే..ఆజాద్‌ మైదానం వరకూ పాదయాత్ర చేస్తామని జరాంగే హెచ్చరించారు. ఆజాద్ మైదాన్‌కు బయలుదేరిన తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని.. రిజర్వేషన్‌ డిమాండ్‌ సాధించిన తర్వాతే ఇళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే గత అర్థరాత్రి ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరాంగేతో చర్చలు జరిపింది. హామీలు నెరవేరుస్తామంటూ ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చింది. ఆ మేరకు ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా విడుదల చేసింది. దీంతో ఆందోళనను విరమిస్తున్నట్లు జరాంగే ప్రకటించారు. మొత్తానికి మరాఠా రిజర్వేషన్ల ఆందోళనను ప్రశాంతంగా ముగియడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.

విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నది మనోజ్‌ జరాంగే డిమాండ్‌. ఈ డిమాండ్‌తో ఈ నెల 20న మహారాష్ట్రలోని అంతర్‌ వాలి గ్రామం నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. వాస్తవానికి ఈరోజు ఈ ర్యాలీ, ముంబై నగరంలోకి ఎంటర్‌ కావాల్సి ఉంది. ఒకవేళ, అదే జరిగితే, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. దీంతో అర్థరాత్రి చర్చలు జరిపి, ఈ ర్యాలీ ఆగేలా చేయడంలో ప్రభుత్వం సక్సెస్‌ అయింది.

మహారాష్ట్ర జనాభాలో మరాఠాలు 33 శాతం ఉన్నారు. అయితే అన్నిరంగాల్లో వెనుకబడ్డ తమకు రిజర్వేషన్లు కల్పించాలని ఆ వర్గం ఎప్పటినుండో డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో 2018 నవంబర్ 30న బీజేపీ ప్రభుత్వం..మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించింది. అయితే ఈ బిల్లును 2021 మే 5న సుప్రీంకోర్టు కొట్టివేసింది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని అతిక్రమించి మరాఠా రిజర్వేషన్‌ కల్పించడంలో ఎలాంటి సహేతుకత కనిపించడం లేదని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అప్పటినుండి ఈ ఉద్యమం కొనసాగుతోంది.