మిస్టర్ కూల్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో అలిగి రాజీనామాకు సిధ్ధపడ్డారట. యూపీఏ-2 హయాంలో అప్పటి ప్రభుత్వం తెచ్చిన ఓ జీవోను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చించి వేయడమే ఆయన ఆగ్రహానికి కారణమైందట. వివరాల్లోకి వెళ్తే.. అది 2013 సంవత్సరం. అప్పట్లో అవినీతి ఆరోపణల మచ్ఛపడిన ఎంపీలకు రెండేళ్ల జైలుశిక్ష విధించాలని సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పు నేపథ్యంలో.. నాటి ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును తెచ్చింది. అయితే వివాదాస్పదమైన ఈ ఆర్డినెన్స్ పూర్తి అర్థరహితమైనదని, చించి.. పారవేయదగినదని రాహుల్ అభివర్ణించారట. దీనివల్ల తమ ప్రభుత్వం ఇరకాట పరిస్థితినెదుర్కొనవచ్ఛునని భావించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారట. ఆ సమయానికి మన్మోహన్ సింగ్ అమెరికాలో ఉన్నారు. ఒకప్పటి ప్లానింగ్ కమిషన్ (ప్రణాళికా సంఘం) ఉపాధ్యక్షుడైన మాంటెక్ సింగ్ ఆహ్లువాలియా ఈ విషయాలన్నీ తన పుస్తకంలో రాశారు. ‘బ్యాక్ స్టేజ్.. ది స్టోరీ.. బిహైండ్ ఇండియాస్ హై గ్రోత్ ఇయర్స్’ అనే పుస్తకమిది ! నాడు మన్మోహన్ తో బాటు న్యూయార్క్ వెళ్లిన ప్రతినిధి బృందంలో తానూ ఉన్నానని, అక్కడ ఉండగా తన సోదరుడు, మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన సంజీవ్…. మన్మోహన్ ను విమర్శిస్తూ రాసిన ఓ ఆర్టికల్ ను తనకు ఈ-మెయిల్ చేయగా ..దాన్ని మన్మోహన్ కు చూపానని ఆహ్లువాలియా తెలిపారు. ఇది చదివిన మన్మోహన్ రాజీనామాకు సిధ్ధపడ్డారని పేర్కొన్నారు. ఆర్డినెన్స్ జీవోను చించివేయాలని అన్నారంటే అది ప్రధానమంత్రి కార్యాలయాన్ని అవమానించడమేనని.. అంటే తనను అవమానించినట్టేనని మన్మోహన్ భావించారని ఆయన తెలిపారు. అయితే ఈ ఆలోచన మంచిది కాదని తాను సలహా ఇచ్చానని, దీంతో ఆయన వెనక్కి తగ్గారని ఆహ్లువాలియా వివరించారు. మన్మోహన్ సింగ్ తిరిగి ఢిల్లీకి వఛ్చిన అనంతరం ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.
యూపీఏ-2 హయాంలో పలువురు మంత్రులపై వఛ్చిన అవినీతి ఆరోపణల గురించి, పాలసీ వైఫల్యాల గురించి ఆహ్లువాలియా ఈ బుక్ లో పేర్కొన్నారు. నాటి పలు ప్రభుత్వ పథకాలు ఈయన వల్లే పాపులర్ అవుతూ వచ్చాయి.