
మారుతున్న కాలంతో పాటు మానవ సంబంధాలకు ఓ అర్థం లేకుండా పోతుంది.. పరిచయాలు కాస్త ప్రేమగా మారి అవి పెళ్లి వరకు చేరకుండా మధ్యలోనే సమసిపోతున్నాయి. పైగా ఆ పరిచయాలు కూడా ఏ సోషల్ మీడియా ద్వారానో లేదా ఆన్లైన్ పరిచయాలే ఎక్కువగా ఉంటున్నాయి. పెళ్ళికి ముందే సహజీవనం చేయడం.. నచ్చకపోతే విడిపోవడం ఇదే ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. అంతవరకూ ఉంటే బాగానే ఉంటుంది.. కానీ తాజాగా జరిగిన ఓ సంఘటనలో ప్రియురాలే ప్రియుడిని హత్య చేసింది. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టర్–150లో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ప్రేమికురాలే తాను ప్రేమించిన యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మణిపూర్‌కు చెందిన యువతి, సౌత్ కొరియాకు చెందిన యువకుడు కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి లివింగ్ రిలేషన్‌షిప్ కొనసాగిస్తూ ఒకే దగ్గర నివసిస్తున్నారు. అయితే అందరి ప్రేమకథలో లాగే వీళ్ల జీవితంలో కూడా చిన్నాచితక గొడవలు వచ్చాయి. అది కాస్తా పెరిగి పెద్దదై విడిపోయేవరకూ దారి తీసింది. ఈ క్రమంలో ఆ యువతి తను ప్రేమించిన వ్యక్తిని కత్తితో దారుణంగా పొడిచింది. ఆవేశంలో చేశానని అనుకుందో మరి ఏమో.. పొడిచిన అనంతరం రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ప్రియుడిని స్వయంగా ప్రియురాలే ఆస్పత్రిలో చేర్పించింది. అయితే చికిత్స పొందుతూ ఆ యువకుడు చివరికి ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలైన యువతిని అరెస్టు చేశారు. హత్యకు గల అసలు కారణాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరికీ ఎక్కడ పరిచయం.. అది ఎలా ప్రేమకు దారి తీసింది.. అసలెందుకు ప్రేమించిన మనిషినే కత్తితో పొడిచి చంపాల్సి వచ్చిందనే విషయాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..