ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసేందుకు కనిపిస్తే కాల్చివేతకు మణిపూర్ గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు చోట్ల నిరసనకారుల్ని అదుపు చేయడానికి భద్రత దళాలు కాల్పులు జరపారు. ఈ మారణహోమంలో మరణించిన వారి సంఖ్య 54కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బుల్లెట్ తగిలిన మరికొంత మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఆర్మీ దళాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర పోలీసులు బలగాలలు సమస్యాత్మక ప్రాంతాలు, రహదారుల్లో పహరా కాస్తున్నాయి. ఆర్టికల్ 355ను సైతం కేంద్ర అమల్లోకి తీసుకొచ్చింది. శనివారం ఉదయం నాటికి అక్కడ ఉధ్రిక్త పరిస్థితులు అదుపులోకి రావడంతో షాపులు, మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం బయటకు వస్తున్నారు. కార్లు వంటి ఇతర వాహనాలు సైతం రోడ్డెక్కాయి.
శుక్రవారం రాత్రి చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఇద్దరు ఇండియా రిజర్వ్ బెటాలియన్ జవాన్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. చురాచంద్‌పూర్ జిల్లాలోని సైటన్‌లో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మిలిటెంట్లు టోర్బంగ్ వద్ద భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని, ఇద్దరు ఐఆర్‌బీ జవాన్లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
మరోవైపు ఇప్పటి వరకు మొత్తం 13 వేల మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రక్షణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వారికి సైనిక శిబిరాలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించినట్లు చెప్పారు. గడిచిన 12 గంటల్లో ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో చెదురుమదురు సంఘటనలు చోటుచేసుకున్నాయిని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు. అయితే వేగంగా స్పందించిన ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు పరిస్థితిని నియత్రణలోకి తీసుకొచ్చాయని తెలిపారు.
కాగా ఇంఫాల్ లోయలో నివసించే మైతీలు తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిని కుకీ గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఎస్టీ హోదా కోసం మైతీలు చేస్తున్న డిమాండ్‌పై నాలుగు వారాల్లోగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మణిపూర్ హైకోర్టు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఈ రెండు వర్గాల మధ్య గత బుధవారం నుంచి ఘర్షణలను జరుగుతున్నాయి. అక్కడి పరిస్థిని అదుపు చేసేందుకు దాదాపు 10,000 మంది సైనికులు రాష్ట్రంలో మోహరించారు. మణిపూర్‌లో శాంతిభద్రతలను కాపాడేందుకు కేంద్రం అదనపు భద్రతా బలగాలను పంపింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.