ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో. హర్యానాలో జరిగిన ఓ పెళ్లి వేడుక కాస్త డెత్ స్పాట్‌గా మారింది. డీజే సౌండ్ ఎదుట డ్యాన్స్‌లు చేస్తున్న సమయంలో తుపాకీ బుల్లెట్ మరో వ్యక్తికి తగిలింది. అంతే.. అప్పటివరకు పెళ్లి జోష్‌లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్న యువకులంతా ఒక్క చావు కేకతో షాక్ అయ్యారు. ఆశ్చర్యకరమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యానాలోని పానిపట్ జిల్లా ఇస్రానా పట్టణంలో జరిగిందీ ఘటన. సమల్బాలోని బుద్షామ్ గ్రామానికి చెందిన అబ్బాయికి పంజాబ్‌లోని అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఇస్రానాలోని ఓ హోటల్‌లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో అక్కడికి చేరుకున్నారు కొందరు యువకులు. ఈ పార్టీలో మందు, డీజే మ్యూజిక్ ప్రోగ్రామ్ అరెంజ్ చేయడంతో కుర్రాళ్లు మద్యం తాగుతూ చేతుల్లో తుపాకులు పట్టుకొని డ్యాన్స్ చేశారు. పార్టీలో తుపాకీని గాల్లో పేల్చేందుకు గన్ ఎత్తుతుండగా.. ఎదురుగా ఉన్న అరవింద్ అనే యువకుడి శరీరంలోకి దూసుకెళ్లింది. తూటా తగలడంతో అరవింద్ అక్కడే కుప్పకూలిపోయాడు. వెడ్డింగ్ పార్టీ కాస్తా గందరగోళం నెలకొనడంతో తుపాకీ పేల్చిన వ్యక్తి దీపక్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరవింద్‌ని ఎన్‌సి మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించడంతో పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని పానిపట్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతుని బంధువులు పానిపట్‌లోని ఆసుపత్రి దగ్గర పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళన చేపట్టారు. అరవింద్ మరణం ప్రమాదవశాత్తు జరగలేదని.. ఉద్దేశపూర్వకంగానే ప్లాన్ వేసి తన సోదరుడ్ని చంపారని సోదరుడు సందీప్ ఆరోపిస్తున్నారు. ఈ మర్డర్ స్కెచ్‌లో నిశాంత్, దీపక్‌లదే ప్రధాన పాత్ర అని.. అరవింద్‌ని వాళ్లే ఇంటి నుంచి తీసుకెళ్లారని కన్నీటిపర్యంతమవుతున్నారు.
Also Read: Karimnagar: శాతవాహన యూనివర్సిటీలో ఎలుగు.. క్షణక్షణం.. భయం… భయం