మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి భారీ మెజారిటీ రావడంతో ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో తొమ్మిది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారని, శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే, ఎన్‌సిపికి చెందిన అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రులు అవుతారని పార్టీవర్గాలు తెలిపాయి. ఫడ్నవీస్ పేరును ఖరారు చేస్తూ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందరూ ఊహిస్తున్న పేరే వస్తుందా, లేక ఆశ్చర్యంగా కొత్త పేరు తెరపైకి వస్తుందా…? అనేదీ హాట్ టాపిక్‌గా మారింది.
ఎట్టకేలకు బీజేపీ నేత గిరీష్ మహాజన్ మధ్యవర్తిత్వంతో డిప్యూటీ సీఎం పదవికి మాజీ సీఎం ఏక్‌నాథ్ షిండే అంగీకరించారు. సమాచారం ప్రకారం, షిండేకు పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ శాఖ వంటి పెద్ద మంత్రిత్వ శాఖలు ఇవ్వవచ్చని తెలుస్తోంది. అజిత్ పవార్ ఆర్థిక శాఖను పొందే అవకాశం ఉంది. గిరీష్ మహాజన్‌తో షిండే గ్రూపు ఎంపీల సమావేశం తర్వాత మహాయుతి సంక్షోభానికి తెరపడింది. షిండే మంగళవారం మధ్యాహ్నం థానే నుంచి ముంబైలోని వర్షా బంగ్లాకు వెళతారని, వచ్చే మూడు రోజుల పాటు తాత్కాలిక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
డిసెంబరు 5న ప్రమాణ స్వీకారోత్సవం
మంగళవారం మధ్యాహ్నానికి మహాయుతి నేతలు ఆజాద్ మైదాన్‌కు వెళ్లి డిసెంబర్ 5న ప్రమాణస్వీకారోత్సవం ఎక్కడ జరగాలో పరిశీలించనున్నారు. అంతకుముందు సోమవారం, మహారాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను బీజేపీ హైకమాండ్ నియమించింది.
మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వ ప్రమాణస్వీకారోత్సవం గురువారం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డాతో పాటు అధికార ఎన్డీయే కూటమికి చెందిన అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 16 నుంచి 24 వరకు జరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మహాకూటమిలో భాగమైన బీజేపీ 132 సీట్లు, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) 41 సీట్లు గెలుచుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..