హస్తినకు చేరనున్న ‘ మహారాష్ట్ర పంచాయతీ ‘

|

Nov 04, 2019 | 5:46 PM

మహారాష్ట్ర రాజకీయ ‘ లొల్లి ‘ ఢిల్లీకి చేరనుంది. ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం హస్తినలో బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను రాష్ట్రంలో జరిగిన పంటల నష్టంపై షాతో చర్చించేందుకు వచ్చానని, అంతే తప్ప ప్రభుత్వ ఏర్పాటు గురించి ఏమీ మాట్లాడబోనని అన్నారు. త్వరలో కొత్త సర్కార్ ఏర్పడడం మాత్రం ఖాయమని, ఆ విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు. అటు-ఎన్సీపీ సీనియర్ […]

హస్తినకు చేరనున్న  మహారాష్ట్ర పంచాయతీ
Follow us on

మహారాష్ట్ర రాజకీయ ‘ లొల్లి ‘ ఢిల్లీకి చేరనుంది. ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం హస్తినలో బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను రాష్ట్రంలో జరిగిన పంటల నష్టంపై షాతో చర్చించేందుకు వచ్చానని, అంతే తప్ప ప్రభుత్వ ఏర్పాటు గురించి ఏమీ మాట్లాడబోనని అన్నారు. త్వరలో కొత్త సర్కార్ ఏర్పడడం మాత్రం ఖాయమని, ఆ విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు. అటు-ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ కూడా ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశం కానున్నారు. తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఈ నెల 2 న వ్యాఖ్యానించిన ఆయన.. మళ్ళీ మనస్సు మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై పవార్.. సోనియాతో చర్చించవచ్ఛునని తెలుస్తోంది.

మరోవైపు శివసేన నేత సంజయ్ రౌత్.. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ అయి .. . సర్కార్ ఏర్పాటు చేయడానికి అతి పెద్దపార్టీని ఆహ్వానించవలసిందిగా కోరారు. ప్రస్తుతం ఏర్పడిన ప్రతిష్టంభనకు తాము బాధ్యులం కామని.. ఎవ్వరికి మెజార్టీ ఉంటే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు. పార్టీ చీఫ్ ఉధ్ధవ్ థాక్రే తో కలిసి తాను దిగిన ఫోటోను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..’ ఒక లక్ష్యాన్నిచేరడానికి ముందు చేసే ప్రయాణం ఎంతో వినోద భరితంగా ఉంటుంది ‘ అని కామెంట్ చేశారు. అంటే బీజేపీని ‘ కార్నర్ ‘ చేయడానికి సేన సిధ్ధంగా ఉందని భావిస్తున్నారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే మేమే అందుకు రెడీగా ఉంటాం అని రౌత్ పేర్కొన్నారు. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని శివసేన నాయకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. శివసేనకు చెందిన నాయకుడే సీఎం అవుతారని, ముంబైలోని శివాజీ పార్క్ లో ప్రమాణ స్వీకారం జరుగుతుందని ఓ ఆంగ్ల పత్రిక ‘ జోస్యం ‘ చెప్పింది.