మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం అక్కడకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. చంద్రపూర్ నియోజకవర్గం గుగూస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వెళ్తున్న సందర్భంలో మహారాష్ట్ర పోలీసులు రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపి తనిఖీ చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రతి పార్టీ కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పోలీసులు.. సీఎం రేవంత్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేయడం హాట్ టాపిక్ గా మారింది
మహారాష్ట్రలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల సభలో పాల్గొనేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నాగ్ పూర్ కు చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి చంద్ర పూర్ లోని గుగూస్ లో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గంగా వెళ్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఆపి పోలీసులు తనిఖీలు చేశారు. పోలీసులు తనిఖీ జరుగుతున్నంత సేపు సీఎం రేవంత్ రెడ్డి వాహనం లోనే కూర్చున్నారు. పోలీసులకు పూర్తిగా సహకరించారు సీఎం. ఎన్నికల సమయంలో వాహన తనిఖీలు సహజమే అయినా.. సీఎం స్థాయి వ్యక్తులను ఆపి తనిఖీ చేయడం అరుదుగా జరుగుతుంది.
అనంతరం చంద్రాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
మహారాష్ట్ర చంద్రాపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు మాట్లాడుతున్నారు#RevanthReddy
• @revanth_anumula pic.twitter.com/NBm4VnWD7C— Congress for Telangana (@Congress4TS) November 16, 2024
ఇవాళ, రేపు మహారాష్ట్రలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచార గడువు ఈ నెల 18 సాయంత్రంతో ముగియనుండగా.. 20న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ప్రచార ఘట్టం తుది అంకానికి చేరడంతో అగ్రనేతలంతా మహారాష్ట్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎక్కడికక్కడ తనిఖీ చేస్తున్నారు.