గౌహతిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది. ఉద్ధవ్‌థాక్రే సర్కార్‌కు మద్దతు ఉపసంహరణ, అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై షిండే వర్గం చర్చలు జరుపుతోంది. రెబల్ ఎమ్మెల్యేలతో చర్చల తరువాత హోటల్ బయటకు వచ్చారు షిండే. రాజకీయ సంక్షోభం తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు షిండే. తమదే అసలైన శివసేన అన్నారు షిండే. తమ వర్గం ఎమ్మెల్యేలు ఎవరితో టచ్‌లో లేరని సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. బాల్‌థాక్రే హిందుత్వాన్ని తాము ముందుకుతీసుకెళ్తునట్టు తెలిపారు. 50 మంది ఎమ్మెల్యేలు గౌహతిలో ఉన్నారని తెలిపారు. తమపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. త్వరలోనే ముంబైకి వస్తానని స్పష్టం చేశారు షిండే. తాము ద్రోహులం కాదని , శివసైనికులమని అన్నారు షిండే.
ఎమ్మెల్యేలందరూ ఇష్టపూర్వకంగానే వచ్చారు..
హిందుత్వ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ 50 మంది ఉన్నా, అందరూ ఇష్టానుసారం వచ్చారు. హిందుత్వం స్ఫూర్తి నుంచి వచ్చింది. 20 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని ఆరోపిస్తున్న వారిని (సంజయ్ రౌత్/అనిల్ దేశాయ్) బహిరంగపరచాలి. ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వవద్దన్నారు. ఇదిలావుంటే.. ఏక్నాథ్ షిండే ఇవాళ ముంబై లేదా ఢిల్లీకి బయలుదేరవచ్చు. గతవారం గుజరాత్‌లో బీజేపీ అగ్రనేతలతో భేటీ కావడం గమనార్హం. అంతకుముందు, సోమవారం తిరుగుబాటు ఎమ్మెల్యేలు అనర్హత నోటీసుకు సమాధానం ఇవ్వడానికి జూలై 12 వరకు సమయం ఇచ్చారు. అందుతున్న సమాచారం ప్రకారం.. మహారాష్ట్ర శాసనసభలో బలపరీక్షకు సంబంధించి ఏక్నాథ్ షిండే న్యాయవాదులను సంప్రదించారు. ఈ వారంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ తన మెజారిటీని నిరూపించుకోవాలని కోరవచ్చని తెలుస్తోంది.
మరోవైపు ఢిల్లీకి చేరుకున్నారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. బీజేపీ అగ్రనేతలతో ఆయన భేటీ అవుతారు. షిండే వర్గంతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్‌షాతో చర్చలు జరుపుతారు ఫడ్నవీస్.