Maharashtra Political Crisis: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం (Maharashtra) చివరి దశకు చేరుకుంది. ఈ రోజు జరిగే బలపరీక్షకు ముందే ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామాతో మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగింది. శివసేన నేత ఏక్‌నాథ్ శిండే వర్గీయులు తిరుగుబాటుతో అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో మహా వికాస్ అఘాడీ సర్కార్ కూలిపోయింది. కాగా.. కొత్త సీఎంగా బీజేపీ నేత ఫడ్నవీస్ ఎన్నికయ్యే అవకాశం కనిపిస్తోంది. షిండే నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తారని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రెబెల్స్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పనిలో పడింది బీజేపీ. అంతా అనుకూలిస్తే.. మహారాష్ట్రలో ఫడ్నవీస్ మూడోసారి మహారాష్ట్ర సీఎం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏక్‌నాథ్‌షిండే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమకు161 మంది ఎమ్మెల్యే మద్దతు ఉందని ఫడ్నవీస్ (Devendra Fadnavis) పేర్కొన్నారు. నేడు జరిగే బల పరీక్ష అనంతరం మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
అసెంబ్లీలో బలపరీక్ష గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే అవకాశం ఉంది. అయితే.. సీఎం రాజీనామా చేసిన నేపథ్యంలో బలపరీక్ష ఉండదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రే రాజీనామా చేసిన నేపథ్యంలో.. బలాన్ని నిరూపించుకుంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చని సమాచారం. ఇదిలాఉంటే.. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉదయం ముంబైకి చేరుకుంటారని చెబుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీతో జతకడతారని, జూలై 1న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉండొచ్చని సమాచారం.
కాగా.. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. రాత్రి 11.30 గంటలకు గవర్నర్ బంగ్లాకు చేరుకొని రాజీనామా పత్రాన్ని అందజేశారు. దానికి వెంటనే గవర్నర్ భగంత్ సింగ్ కోష్యారీ ఆమోదం తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ ఉద్ధవ్ ను కోరారు.
ఆసక్తికరంగా షిండే అడుగులు..
మరోవైపు.. తిరుగుబాటు జెండా ఎగురవేసిన ఏక్‌నాథ్ షిండే అడుగులు ఆసక్తి రేపుతున్నాయి. 40 మందికి పైగా ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్న షిండే.. తర్వాతి ఆలోచనేంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. తమదే అసలైన శివసేన అని వాదిస్తున్నారు షిండే. బాలాసాహేబ్ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉద్దవ్ వ్యవహరించారని.. బాలాసాహేబ్ అసలైన వారసులం మేమే అని ప్రకటిస్తున్నారు. షిండే మాటల్ని బట్టి.. శివసేనను కబళించే ప్రయత్నం చేస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శివసేనను పూర్తిగా హస్తగతం చేసుకొనేందుకు షిండే న్యాయ పోరాటం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే మహారాష్ట్రలో శాంతిభద్రతల సమస్య తలెత్తే చాన్సుంది. శివసేనను ఎవరూ తాకలేరని ఉద్ధవ్ చెబుతున్నారు. ఉద్ధవ్ హెచ్చరికలు.. షిండే ప్రకటనలతో ముంబైలో హీట్ పెరుగుతోంది. ఉద్ధవ్ వర్సెస్ షిండే అన్నట్టుగా మహారాష్ట్ర రాజకీయాలు మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.