Prison Tourism: ఇప్పటి వరకు మనం ఎన్నో పర్యాటక విధానాలు చూశాం. విదేశాలకని, కొండ ప్రాంతాలకని, అటవీ ప్రాంతాలకని.. ఇలా రకరకాల పర్యాటక ప్రాంతాలకు వెళ్లి ఉంటా. మరి జైళ్ల పర్యాటకం ఎవరైనా చూశారా?.. జైలు జీవితాన్ని ఎప్పుడైనా ఆస్వాదించారా?.. నేరం చేయకుండా కేవలం డబ్బులు చెల్లించి మరీ జైలు జీవితం గడిపే పర్యాటకాన్ని ఏనాడైనా విన్నారా? అమ్మో జైలా?.. అని కంగారు పడకండి. అసలు మ్యాటర్ ఏంటంటే.. జైలు ఎలా ఉంటుంది? అసలు జైలులో గడిపే వారి పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే మహారాష్ట్ర సర్కార్ సరికొత్త పర్యాటకానికి శ్రీకారం చుడుతోంది. పుణె నగరంలోని యరవాడ జైలులో జైలు టూరిజం ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విధానం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ.. మహారాష్ట్ర సైతం ఇప్పుడు ఆ రాష్ట్రాల జాబితాలో చేరేందుకు సిద్ధమవుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన యరవాడ జైలులో పర్యాటక ప్రాజెక్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లు ప్రారంభించనున్నారు.
జైళ్ల పర్యాటకం ఎలా ఉంటుందంటే..
సాధారణంగా జైలును, జైలులో పరిస్థితులను తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తిని కనబరుస్తుంటారు. అలాంటి వారి కోసమే మహారాష్ట్ర సర్కార్ ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా ఎవరైతే జైలులో గడపాలని భావిస్తారో వారు నిర్ణీత డబ్బు చెల్లిస్తే సరిపోతుంది. అలా డబ్బు చెల్లించి జైలులో ఒక రోజంతా ఉండొచ్చు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. కాగా, మహారాష్ట్ర జైళ్లలో జైలు పర్యాటక కార్యక్రమాన్ని చేపట్టడం చరిత్రాత్మకం అని జైళ్ల శాఖ మంత్రి దేశ్ ముఖ్ పేర్కొన్నారు. యరవాడతో పాటు రెండు, మూడు దశల్లో నాసిక్, నాగపూర్ జైళ్లలోనూ పర్యాటక ప్రాజెక్టులను చేపడతామని ఆయన తెలిపారు.
Also read:
NEET Exam: ‘నీట్’పై కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం.. అభ్యర్థులకు ఉరట కలిగేనా..?