Bhagat Singh Koshyari: ఇక చాలు.. మిగిలిన జీవితాన్ని అలా గడిపేస్తా.. గవర్నర్ కీలక నిర్ణయం..!

గవర్నర్‌ పదవి ఇక చాలు, మిగిలిన జీవితాన్ని రచన, పఠనంతో ముగిస్తానని చెప్తున్నారు ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌. కంట్రోవర్సీకి మారుపేరుగా నిలిచిన ఆ గవర్నర్‌ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు?

Bhagat Singh Koshyari: ఇక చాలు.. మిగిలిన జీవితాన్ని అలా గడిపేస్తా.. గవర్నర్ కీలక నిర్ణయం..!
Bhagat Singh Koshyari

Updated on: Jan 23, 2023 | 9:16 PM

గవర్నర్‌ పదవి ఇక చాలు, మిగిలిన జీవితాన్ని రచన, పఠనంతో ముగిస్తానని చెప్తున్నారు ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్‌. కంట్రోవర్సీకి మారుపేరుగా నిలిచిన ఆ గవర్నర్‌ ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు? తనను గవర్నర్‌ బాధ్యతల నుంచి తప్పించాలని ఆయనే ఎందుకు ప్రధానిని కోరారు? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భగత్‌ సింగ్‌ కోశ్యారి – మహారాష్ట్ర గవర్నర్‌ – దాదాపు 40 నెలలుగా ఆయన ఈ బాధ్యతల్లో ఉన్నారు. మహారాష్ట్రకు ఈయన 22వ గవర్నర్‌. ఈ 40 నెలల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో వివాదం సృష్టించాయి. బహుశా ఈ వివాదాలన్నీ కోశ్యారిని కూడా ఇబ్బంది పెట్టి ఉంటాయి. అందుకే ఇక గవర్నర్‌ గద్దె దిగుతానని ఆయన స్వయంగా వెల్లడించారు. తనను బాధ్యతల నుంచి తప్పించాలని ప్రధాని మోదీని స్వయంగా కోరానని కోశ్యారి వెల్లడించారు. గతవారం ముంబయిలో ప్రధాని పర్యటించినప్పుడు కోశ్యారి తన నిర్ణయాన్ని ప్రధానికి చెప్పారట. ఇక శేషజీవితం రచనా వ్యాసంగం, పుస్తక పఠనం, ఇతర కాలక్షేప పనులతో గడపాలని కోశ్యారి నిర్ణయించుకున్నారు.

మహారాష్ట్ర గవర్నర్‌గా 40 నెలల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించి రికార్డు సృష్టించారు కోశ్యారి. ఆ ముగ్గురు సీఎంలు వేర్వేరు పార్టీలకు చెందిన వాళ్లు కావడం మరో విశేషం. రాజకీయ నిర్ణయాలే కాదు తన వ్యాఖ్యలతోనూ వివాదాస్పద వ్యక్తిగా నిలిచారు భగత్‌ సింగ్‌ కోశ్యారి. మరాఠీలు ప్రాణసమానంగా భావించే ఛత్రపతి శివాజీ- పాత కాలానికి గుర్తని, మహారాష్ట్రకు సంబంధించినంత వరకు ఆధునిక ప్రతిబింబాలు అంబేడ్కర్‌, నితిన్ గడ్కరి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరాఠీల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

నాయకుల మధ్యే కాదు ప్రాంతాల మధ్య కూడా చిచ్చుపెట్టారు గవర్నర్‌ కోశ్యారి. గుజరాతీలు, మర్వాడీలను పంపించి వేస్తే దేశ ఆర్థిక రాజధానిగా ముంబయి నిలబడదని సూత్రీకరించారు. మహారాష్ట్రకు చెందిన విపక్షాలన్నీ గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలను తప్పుబట్టాయి. కొల్హాపురి చెప్పులు చూపించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ఒకింత ఘాటుగానే స్పందించారు.

గవర్నర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా చాలా ఉన్నాయి. ముంబయి యూనివర్సిటీ కొత్త భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వర్సిటీలో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్‌కు వినాయక్‌ సావర్కర్‌ పేరు పెట్టాలని సూచించారు. అంతే కాదు చాణక్యుడు లేకపోతే చంద్రగుప్తుడిని ఎవరు గుర్తుంచుకునే వారు. సమర్థ్‌ రామదాస్‌ లేకపోతే ఛత్రపతి శివాజీ గురించి ఎవరు మాట్లాడేవారని వివాదానికి ఆజ్యం పోశారు.

భారతదేశంలో బాలిక విద్యను ఎంతగానో ప్రోత్సహించిన సావిత్రిబాయి ఫులే, జ్యోతిరావ్‌ ఫూలే గురించి కూడా ఎగతాళి చేశారు. పెళ్లినాటికి సావిత్రి వయస్సు 10 ఏళ్లని, జ్యోతిరావు వయస్సు 13 ఏళ్లని, పెళ్లి తర్వాత వాళ్లు ఏం ఆలోచించి ఉంటారని వెటకారంగా మాట్లాడారు. మాటల ద్వారా వివాదాలే కాదు గవర్నర్‌ చర్యలు కూడా వివాదాస్పదమే. ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు శాసనమండలిలో ఖాళీగా ఉన్న 12 ఎమ్మెల్సీ పోస్టుల భర్తీకి సంతకం చేసేందుకు మీనమేషాలు లెక్కించారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ఆయన హడావుడిగా తెల్లవారుజామున దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి రాజకీయంగా ఎంతో అపవాదును మూటగట్టుకున్నారు.

80 ఏళ్ల భగత్‌ సింగ్‌ కోశ్యారికి రాజకీయంగా ఒక విశిష్ఠ రికార్డు ఉంది. శాసనసభ, శాసనమండలి, లోక్‌సభ, రాజ్యసభ – ఇలా అసెంబ్లీ, పార్లమెంట్‌లోని ఉభయ సభలకు ఎన్నికైన చరిత్ర ఉంది. గవర్నర్‌ చర్యలు, వ్యాఖ్యలు అధికార బీజేపీని కూడా ఇరుకున పెట్టిన సందర్భాలున్నాయి. బహుశా అవన్నీ ఆలోచించి ఇప్పుడు శేషజీవితాన్ని రాజకీయాలకు దూరంగా గడపాలని నిర్ణయించుకొని ఉంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..