Maharashtra Elections: మహారాష్ట్రలో ఎన్నికల వేడి.. కాంగ్రెస్‌ , శివసేన ఉద్దవ్‌ వర్గం మధ్య విభేదాలు..!

|

Oct 20, 2024 | 9:30 PM

మహారాష్ట్రలో మహా వికాస్‌ అఘాడి కూటమిలో సీట్ల పంచాయితీ కొనసాగుతోంది. కూటమిలో విభేదాల కారణంగా ఢిల్లీలో జరగాల్సిన కాంగ్రెస్‌ సీఈసీ సమావేశం వాయిదా పడింది. పీసీసీ చీఫ్‌ నానా పటోలే వస్తే తాము చర్చలకు హాజరుకాబోమని ఉద్దవ్‌ వర్గ వార్నింగ్‌ ఇచ్చింది. మరోవైపు బీజేపీ 99 మంది అభ్యర్ధులతో తొలి జాబితాను విడుదల చేసింది.

Maharashtra Elections: మహారాష్ట్రలో ఎన్నికల వేడి.. కాంగ్రెస్‌ , శివసేన ఉద్దవ్‌ వర్గం మధ్య విభేదాలు..!
Maha Vikas Aghadi
Follow us on

మహారాష్ట్రలో ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అయినప్పటికి మహా వికాస్‌ అఘాడి కూటమిలో సీట్ల సర్ధుబాటు ఇంకా కొలిక్కి రాలేదు.. కాంగ్రెస్‌, శివసేన ఉద్దవ్‌ వర్గం మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. రెండు పార్టీల మధ్య పొత్తు చర్చలు ముందుకుసాగడం లేదు. దీంతో ఉద్దవ్‌ ఠాక్రే తన నివాసంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ అగ్రనేతలంతా హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పీసీసీ చీఫ్‌ నానా పటోలే చర్చల్లో పాల్గొంటే తాము బాయ్‌కాట్‌ చేస్తామని ఉద్దవ్‌ వర్గం ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం, పలు విషయాలపై క్లారిటీ కోసం.. శరద్ పవార్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది.. విపక్ష కూటమిలో విభేదాలను పరిష్కరించడానికి శరద్ పవార్ మధ్యవర్తిత్వం వహించనున్నట్లు పేర్కొంటున్నారు.

సంజయ్‌ రౌత్‌ తీరుపై కాంగ్రెస్‌ నేతల ఆగ్రహం

మహా వికాస్‌ అఘాడి కూటమికి సంబంధించి 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని న్సీపీ నేత శరద్‌పవార్‌ ప్రకటించారు. కాని వాస్తవ పరిస్థితి అలా కన్పించడం లేదు. శివసేన ఉద్దవ్‌ వర్గం కీలక నేత సంజయ్‌ రౌత్‌ తీరుపై మహారాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఉద్దవ్‌ ఠాక్రేను సంజయ్‌ రౌత్‌ కంట్రోల్‌ చేస్తున్నారని, పొత్తు చర్చలు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని మహారాష్ట్ర పీసీసీ చీఫ్‌ నానా పటోలే తీవ్ర ఆరోపణలు చేశారు. అయినప్పటికి ఉద్దవ్‌ పార్టీ అంతర్గత వ్యవహారంలో తాము జోక్యం చేసుకోమన్నారు. అయితే పైకి మాత్రం తమ కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని ఉద్దవ్‌ వర్గం నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ కూడా మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఢిల్లీలో సీఈసీ సమావేశం సోమవారం జరుగుతుంది. అభ్యర్ధుల ఎంపికపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. రెండు రోజుల్లో అభ్యర్ధులను ప్రకటిస్తామని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ రమేశ్‌ చెన్నితల తెలిపారు. అయితే ఎన్ని సీట్లలో పార్టీ పోటీ చేస్తుందన్న విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు అక్కడ చేసిన పొరపాట్లను మహారాష్ట్రలో రిపీట్‌ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుతో పాటు , పార్టీ అంతర్గత కలహాలపై ఎటువంటి కామెంట్స్‌ చేయరాదని ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలకు కాంగ్రెస్‌ హైకమాండ్ గట్టి వార్నింగ్‌ ఇచ్చింది.

99 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా

మహా వికాస్‌ అఘాడి కూటమి ఇంకా సీట్లను ఖరారు చేయలేదు. కాని అభ్యర్ధులను ప్రకటించడంలో బీజేపీ అందరికంటే ముందుంది. 99 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. నాగ్‌పూర్‌ సౌత్‌ వెస్ట్‌ సీటు నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ భావన్‌కులే కామ్తీ సీటు నుంచి పోటీ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..