మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాగారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నాసిక్ – షిరిడీ హైవేపై చోటు చేసుకోగా.. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. థానే, ఉల్లాస్‌నగర్, అంబేర్‌నాథ్‌కు చెందిన వీరంతా షిర్డీకి వెళ్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహారాష్ట్రాలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాయిబాబా భక్తులు బస్సులో షిర్డీకి వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో నాసిక్-షిర్డీ జాతీయ రహదారిపై పతారే వద్ద వీరు ప్రయాణిస్తున్న బస్సు ఎదురుగా ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్పికి తరలించారు అధికారులు. అయితే, గాయపడ్డ వారిలోనూ కొందరు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు, అధికారులు చెబుతున్నారు. ఇక మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, ఓ వ్యక్తి ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే, ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..