Maha Shivaratri Special: మహాశివరాత్రి స్పెషల్.. శివఖోడి గుహాలయం ప్రత్యేకతలు ఇవే..

Maha Shivaratri Special: అనంత విశ్వానికి ఆవల… గాఢాంధకారానికి అవతల అఖండమైన రూపంతో దేదీప్యమానంగా ప్రకాశించే దేవుడే పరమేశ్వరుడు.. ఆయన సర్వేశ్వరుడు.. సర్వాంతర్యామి… మనిషి చేరుకోలేని సంక్లిష్టమైన స్థలాలలో కూడా శివుడు కొలువై ఉంటాడు. జమ్మూలోని శివఖోడి గుహాలయం ఇంచుమించు ఇలాంటిదే! ఆ గంగాధరుడి సన్నిధికి చేరుకోడానికి ఎంతో కష్టపడాలి… కశ్మీర్‌లో ఖోడి అంటే గుహ.. శివుడు నివాసం ఉంటున్నాడు కాబట్టి శివఖోడి అయ్యింది… జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో రణసు అన్న గ్రామంలో ఉన్న అద్భుత […]

Maha Shivaratri Special: మహాశివరాత్రి స్పెషల్.. శివఖోడి గుహాలయం ప్రత్యేకతలు ఇవే..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Feb 21, 2020 | 4:00 AM

Maha Shivaratri Special: అనంత విశ్వానికి ఆవల… గాఢాంధకారానికి అవతల అఖండమైన రూపంతో దేదీప్యమానంగా ప్రకాశించే దేవుడే పరమేశ్వరుడు.. ఆయన సర్వేశ్వరుడు.. సర్వాంతర్యామి… మనిషి చేరుకోలేని సంక్లిష్టమైన స్థలాలలో కూడా శివుడు కొలువై ఉంటాడు. జమ్మూలోని శివఖోడి గుహాలయం ఇంచుమించు ఇలాంటిదే! ఆ గంగాధరుడి సన్నిధికి చేరుకోడానికి ఎంతో కష్టపడాలి… కశ్మీర్‌లో ఖోడి అంటే గుహ.. శివుడు నివాసం ఉంటున్నాడు కాబట్టి శివఖోడి అయ్యింది… జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో రణసు అన్న గ్రామంలో ఉన్న అద్భుత గుహాలయంలో మహాశివుడు వెలిశాడు.. ఈ గుహప్రాంతానికి చేరుకోడానికి కాలినడకన నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే! జమ్ము నుంచి ఈ గుహాలయానికి చేరుకోడానికి రెండు మార్గాలున్నాయి.. వైష్ణోదేవి మందిరానికి ట్రెక్‌ మొదలయ్యే కట్రా టౌన్‌ మీదుగా వెళ్లవచ్చు.. అఖనూర్‌ మీదుగా రాజోరి వెళ్లేదారికి ఖండామోర్హా జంక్షన్‌ నుంచి కూడా రణసు గ్రామానికి చేరుకోవచ్చు.. వైష్ణోదేవి ఆలయ ట్రస్ట్‌ రోడ్లు వేసింది కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే ఈ గుహలను చేరుకోవడం దుర్లభమయ్యేది… కట్ర నుంచి రణసుకు వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులోనే ప్రయాణించాలి.. రణసు నుంచి గుహ వరకు నాలుగు కిలోమీటర్ల నడకదారి… చాతగాని వాళ్లు గుర్రాల మీద వెళ్లవచ్చు.. గుర్రాల మీద కూడా వెళ్లలేనివారు డోలీలను ఎంచుకోవచ్చు…

ఇప్పుడు సౌకర్యాలు కాసింత మెరుగుపడ్డాయి కాబట్టి భక్తుల సంఖ్య పెరిగింది… గుహలోని అంతర్బాగం చాలా విశాలంగా ఉంటుంది.. ఎంతగా అంటే ఒకేసారి మూడువందల మంది భక్తులు ప్రార్థనలు చేసుకునేంతగా..! అక్కడ్నుంచి లోపలికి పాక్కుంటూ వెళ్లాలి… కొన్ని చోట్ల అయితే పొట్ట నేలకు ఆనించి పాకవలసి ఉంటుంది.. అలా ఎంతో కష్టపడి వెళితే వెడల్పాటి గుహ వస్తుంది… లోపలికి వెళ్లగానే ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది.. అక్కడి దృశ్యాలను చూసి ఆశ్చర్యానందభరితులమవుతాం! జగన్మాత పార్వతీదేవి.. వినాయకుడు.. నారదుడు.. పరమశివుడి ఝటాఝూటం.. పద్మం ఇలా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన దేవిదేవతా మూర్తులు గోచరిస్తాయి.. చేతికందేంత ఎత్తులో బహు పడగల ఆదిశేషుడిని దర్శించుకోవచ్చు.. అక్కడ్నుంచి కొంతదూరం లోపలికి వెళితే… రెండు మార్గాలు వస్తాయి.. అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్లు యాత్రికులను రెండో దారిలోంచి పంపుతారు.. మొదటిదారి నిషిద్ధం… 200 మీటర్ల పొడవు.. మూడు మీటర్ల ఎత్తు… ఒక మీటర్‌ వెడల్పు ఉన్న ఈ గుహలో ఊపిరి తీసుకోవడం కాసింత కష్టమే అవుతుంది.. శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇంత కష్టపడి వెళితే తప్ప శివ దర్శనం లభించదు. .లోపలికి వెళితే నాలుగు అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కనిపిస్తుంది.. ఆ లింగాన్ని నిరంతరం అభిషేకిస్తున్న పాలరంగులో ఉండే జలధార విస్మయానికి గురి చేస్తుంది.. ఆ క్షీరధారనే ధూద్‌గంగ అంటారు.. పరమశివుడి దర్శనం తర్వాత అంతసేపు పడిన కష్టమంతా దూదిపింజలా ఎగిరిపోతుంది… అసలు శివుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు…? స్థలపురాణం ఏం చెబుతుంది…? భస్మాసురుడి కథ తెలుసుగా..!. అతడు గొప్ప శివభక్తుడు.. మరణం లేకుండా ఉండాలనే కోరికతో శివుడి కోసం తపస్సు చేస్తాడు.. భస్మాసుడికి తపస్సుకు మెచ్చిన శివుడు ఏ వరం కావాలో కోరుకోమంటాడు. తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం అయ్యేట్టు వరం అనుగ్రహించమంటాడు. శివుడు తథాస్తూ అంటాడు.. శివుడు ఇచ్చిన వరప్రభావాన్ని శివుడిపైనే ప్రయోగించి చూడాలనుకుంటాడు భస్మాసురుడు.. శివుడు భస్మాసురుడిని తప్పించుకుని పారిపోతూ ఈ గుహలో దాక్కున్నాడట! మిగతా కథ మనకు తెలిసిందే! ఇదీ ఇక్కడి స్థల పురాణం..

ఈ గుహ నుంచి రెండు సొరంగ మార్గాలున్నాయి.. ఒక దారేమో నేరుగా స్వర్గానికి చేరుస్తుంది. అమరలోకానికి చేరుకోవాలన్న కోరికతో కొంతమంది ప్రయత్నించారట కూడా! అయితే వారెవ్వరూ వెనక్కి తిరిగి రాలేదట! అందుకే ఎవరూ సాహసం చేయరు… ఇంకో మార్గం కూడా ఉంది.. ఆ దారంట నడిచి వెళితే అమర్‌నాథ్‌ ఆలయానికి చేరుకోవచ్చట! కొంతమంది సాధువులు ఈ ప్రయత్నం కూడా చేశారట! ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని కూడా మూసివేశారు. ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పున్నమి వరకు జరిగే అమర్‌నాథ్‌లో పూజలందుకునే శివుడు మిగతా సమయంలో ఈ గుహలోనే ఉంటాడన్నది స్థానికుల విశ్వాసం.. అందుకే కాబోలు ఈ క్షేత్రాన్ని బూఢా అమర్‌నాథ్‌ అని కూడా అంటారు. ఈ క్షేత్రంలో మరో అద్భతం పావురాళ్లు.. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించని కపోతాలు కేవలం ఈ గుహలోనే దర్శనమిస్తాయి.. ఎన్నో ఎళ్ల నుంచి ఈ పావురాళ్ల సంఖ్య అంతే ఉండటం కూడా ఆశ్చర్యకరం. అమర్‌నాథ్‌లాగే ఇక్కడ కూడా రెండు అదృశ్య పావురాళ్లు ఉంటాయట! పుణ్యం చేసినవారికి మాత్రమే అవి దర్శనం ఇస్తాయట! కొన్నేళ్ల కిందట శివఖోడి కేవలం కొందరికే తెలుసు.. ఇప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు.. మహాశివరాత్రి సమయంలో ఈ క్షేత్రంలో మూడు రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది….