Maha kumbhmela: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మహా వేగంగా పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ భయంకరంగా ఉంది. కట్టడి చేయడానికి ప్రభుత్వాలు నానా కష్టాలు పడుతున్నాయి. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరుగుతున్న మహాకుంభ్ మేళా బ్రహ్మాండంగా జరుగుతున్నా.. ఎక్కడో ఏదో భయం తన్నుకొస్తున్నది. లక్షలాది మంది ఒకే దగ్గర చేరడంతో కుంభ్‌మేళా సూపర్ స్ప్రెడర్‌గా మారుతుందేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కుంభమేళా ప్రాంతంలో లక్షన్నర మంది ప్రజలున్నారు. జనవరి 14న ప్రారంభమైన మహా కుంభమేళాలో ఇప్పటివరకు రెండు షాహీ స్నానాలు జరిగాయి. మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ఒకటి, ఏప్రిల్ 12న సోమవతి అమావాస్య సందర్భంగా మరో షాహీ స్నానాలు జరిగాయి. లక్షలాది మంది ప్రజలు ఒకే చోట చేరడంతో కుంభ్‌మేళా సూపర్‌స్ప్రెడర్‌గా మారే అవకాశాలు లేకపోలేదు.. ఇదే భయం అధికారులను వెంటాడుతోంది. మామూలు రోజుల్లో కనీసం రెండు నుంచి అయిదు లక్షల మంది భక్తులు కుంభమేళాలో ఉంటారు. ఇక షాహీ స్నానాలప్పుడు అయితే పాతిక లక్షల నుంచి 30 లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. మొన్న ఏప్రిల్ 12న సోమ్‌వతి అమావాస్య సందర్భంగా జరిగిన షాహీ స్నానాల్లో సుమారు 31 లక్షల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారట! ఇవాళ మళ్లీ హరిద్వార్ మహా కుంభ్‌మేళాలో బైశాఖి షాహీ స్నానాలు జరుగుతున్నాయి. దీనికి కనీసం పాతిక లక్షల మంది భక్తులు హాజరవుతారు. ఇలాంటప్పుడు కరోనా వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉంది.
పైగా కుంభ్‌మేళాకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని అధికారులు అంటున్నారు. ఎవరూ సామాజిక దూరాన్ని పాటించడం లేదని, మాస్క్‌లు కూడా పెట్టుకోవడం లేదని అధికార యంత్రాంగం అంటోంది. మాస్క్‌లు పెట్టుకోనివారికి జరిమానాలు విధించడం తమ వల్ల కావడం లేదని చేతులెత్తేశారు అధికారులు. లక్షలమంది ఒకే దగ్గర ఉన్నప్పుడు ప్రోటోకాల్స్ అనుసరించడం సాధ్యమయ్యే పని కాదు. ఏప్రిల్ 11 న కుంభమేళాకు వచ్చిన 53,000 మందికి కరోనా పరీక్ష జరిపారు. ఇందులో కేవలం 1.5 శాతం మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందని అధికారులు అంటున్నారు. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలను అతిక్రమించినవారికి జరిమానాలు విధిస్తామని అధికారులు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 600 హెక్టార్లలో విస్తరించి ఉన్న కుంభ్‌మేళా ప్రాంతంపై నిఘా ఉంచడానికి 20 వేల మందికి పైగా పోలీసులు, పారా మిలటరీ సిబ్బందిని నియమించారు. కరోనా ఉంది కాబట్టే భక్తుల సంఖ్య సగానికి సగం దగ్గింది. ఇదిలా ఉంటే కుంభమేళాలో భారీగా వచ్చిన భక్తుల ఫోటోలు సోషల్ మీడియాలో అనేకం షేర్ అవుతున్నాయి. నిరుడు మార్చి 10 నుంచి 12 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మార్కజ్‌లో రెండు వేల మంది పాల్గొన్న జమాత్ కార్యక్రమాన్ని సూపర్ స్ప్రెడర్‌గా పెద్ద ఎత్తున హంగామా చేసినప్పుడు, లక్షలమంది ప్రజలు ఒకే దగ్గర చేరిన మహా కుంభ్‌మేళాను ఏ విధంగా చూడాలనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు మాత్రం మహాకుంభ్‌మేళా సూపర్ స్ప్రెడర్‌గా మారే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.
Also read: