బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి రామాయణ పుస్తకాన్ని ఇస్తానని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ రామేశ్వర శర్మ అన్నారు. దీన్ని జాగ్రత్తగా చదవాలని సూచిస్తానని చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి వఛ్చిన ఒత్తిడి కారణంగానో, తన ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకునో ఆమె జై శ్రీరామ్ నినాదాన్ని వ్యతిరేకిస్తున్నారని అయన అన్నారు. రాముడి పేరును ఒకరు వ్యతిరేకించడమేమిటని ప్రశ్నించారు. ప్రస్తుత స్థితి ఏమిటో, గతంలో రాముడ్ని వ్యతిరేకించినవారి పరిస్థితి ఏమిటో అందరికీ తెలిసిందే అన్నారాయన. రాముడ్ని వ్యతిరేకించిన రావణుడి స్థితి ఏమైందో తెలుసు కదా అని వ్యాఖ్యానించారు. తాను ప్రొటెం స్పీకర్ అయినా ఎలాంటి సంకోచం లేకుండా జైశ్రీరామ్ అని నినదిస్తా అని రామేశ్వర శర్మ అన్నారు. మమత నివాసంలో 20 రోజులపాటు కూర్చుని రామాయణ ప్రవచనాలు వినిపిస్తానని, రాముడి పేరు వింటే అందరికీ ప్రయోజనం కలుగుతుందని అన్నారు.
నిన్న కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మమత.. జై శ్రీరామ్ అని నినాదాలు చేసినవారిపట్ల అసహనం వ్యక్తం చేసి.. మాట్లాడడానికి నిరాకరించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, ఇందులో అలాంటి నినాదాలు చేయరాదని పరోక్షంగా ఆమె పేర్కొన్నారు.