
తమిళనాడులో సంచలనం సృష్టించిన సాతాంకుళం కస్టడీ మరణాల కేసులో 9 మంది పోలీసులకు మదురై అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2020 జూన్ 19న కరోనా లాక్‌డౌన్ సమయంలో షాప్ ఆలస్యంగా మూసేశారన్న ఆరోపణలతో జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించారు. పోలీసుల దెబ్బలకు తీవ్రంగా గాయపడిన తండ్రి కొడుకులను హాస్పిటల్‌లో చేర్చించారు. అయితే జూన్ 22న బెనిక్స్, జూన్ 23న జేయరాజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
పోలీసుల కస్టడీలో తిన్న దెబ్బలకారణంగా ఇద్దరు తండ్రి కొడుకులు చనిపోవడం అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. ఈ ఘటనను మద్రాస్ హైకోర్టు సుమోటోగా తీసుకుని 2020 జూన్ 29న కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ దాదాపు ఆరు సంవత్సరాల విచారణ తర్వాత కోర్టుకు ఆధారాలను సమర్పించింది.
తాజాగా సోమవారం కేసుపై జరిగిన విచారణ సందర్భంగా సీబీఐ ఆధారాలను పరిశీలించిన కోర్టు ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది పోలీసులను దోషులుగా తేల్చి వారికి ఉరిశిక్ష విధించింది. అయితే కేసులో మొత్తం 10 మంది ఉండగా ఓ నిందితుడు కోవిడ్ కారణంగా 2020లోనే చనిపోయాడు. ఇక ట్రయల్ కోర్టు తీర్పుపై బాధితుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.