చీకటి రాత్రి మిగిల్చిన గుండెకోత.. పార్సెల్ నెపంతో పిలిచి మైనర్ బాలుడి ప్రాణాలు తీశారు!
ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన, సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ప్రేమ వ్యవహారం మనసులో పెట్టుకుని, ఒక 15 ఏళ్ల మైనర్ బాలుడిని అత్యంత కిరాతకంగా కొట్టి, ఆపై బలవంతంగా విషమిచ్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భదోహి జిల్లాలో జరిగిన ఈ ఘాతుకానికి నిరసనగా ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు, వందలాది మంది గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చి భారీ ఆందోళన చేపట్టారు.

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత దారుణమైన, సంచలనాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం ప్రేమ వ్యవహారం మనసులో పెట్టుకుని, ఒక 15 ఏళ్ల మైనర్ బాలుడిని అత్యంత కిరాతకంగా కొట్టి, ఆపై బలవంతంగా విషమిచ్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భదోహి జిల్లాలో జరిగిన ఈ ఘాతుకానికి నిరసనగా ఆగ్రహించిన బాధితుడి కుటుంబ సభ్యులు, వందలాది మంది గ్రామస్థులు రోడ్డుపైకి వచ్చి భారీ ఆందోళన చేపట్టారు.
ఈ దిగ్భ్రాంతికర ఘటన భదోహి జిల్లా చౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేద్మన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువు రాహుల్ తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం (జూన్ 02) రాత్రి సుమారు 11 గంటల సమయంలో, ప్రేమలో ఉన్న సదరు బాలిక కుటుంబ సభ్యులు ఒక పార్సెల్ తీసుకురావాలనే నెపంతో 15 ఏళ్ల పింటూ ధివార్‌ను బయటకు పిలిచారు. పింటూ ఇంటి నుండి కొద్ది దూరంలోకి రాగానే, పక్కా ప్రణాళికతో పొంచి ఉన్న నిందితులు అతడిని చుట్టుముట్టి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా, అతడికి బలవంతంగా విష పదార్థాన్ని తాగించారు. దాడి అనంతరం విషం ప్రభావంతో పింటూ రోడ్డుపైనే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ బాలుడు ప్రాణాలు విడిచాడు.
తమ ఏకైక కుమారుడు మరణించాడనే వార్త తెలియడంతో బాధితుడి కుటుంబం, గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయారు. బుధవారం వారణాసి నగరం – విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారిపై పింటూ మృతదేహాన్ని ఉంచి, వెదురు కర్రలతో రోడ్డును పూర్తిగా దిగ్బంధించారు. ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి మేనమామ చందన్ కుమార్ గౌర్ మాట్లాడుతూ, “ఆ రాత్రి పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే మా మేనల్లుడు బతికేవాడు. నిందితుల అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేయాలి. నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చాలి. అలాగే బాధిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక పరిహారం అందించాలి” అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను వేడుకున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన భదోహి ఎస్‌డీఎం అరుణ్ గిరి, ఔరై సర్కిల్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ భారీ పోలీసు బలగాలు మరియు పీఏసీ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఔరై సర్కిల్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ప్రాథమిక విచారణలో ఇది ప్రేమ వ్యవహారంగా తేలిందని, సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాలిక తండ్రి అశోక్ మౌర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు బాలికను కూడా మహిళా పోలీసుల అదుపులో ఉంచి విచారిస్తున్నారు. నిష్పక్షపాత విచారణ జరిపి, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో సాయంత్రానికి రహదారి దిగ్బంధం ముగిసింది.
పోలీసులు అర్ధరాత్రి పింటూ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించగా, కన్నీటి వీడ్కోలు మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ కుటుంబానికి పింటూ ఏకైక కుమారుడు కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం పింటూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా (pintu_kashyap_4) చూస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. నలుగురు ముసుగుధారులను వెంటబెట్టుకుని వచ్చి బాలిక తండ్రి ఈ దారుణానికి ఒడిగట్టకుండా ఉంటే, తమ ఇంటి వెలుగు తమతోనే ఉండేదని వారు ఘోరంగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో వేద్మన్‌పూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
