AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైలుకు వెళ్లడమే హాబీ! మూడుసార్లు వెళ్లొచ్చినా తీరని మోజు.. సెంట్రల్ జైలు కోసం ఏకంగా భార్యనే!

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన హాబీ ఉంటుంది. కొందరికి పుస్తకాలు చదవడం, మరికొందరికి ప్రయాణాలు చేయడం, ఇంకొందరికి ఖరీదైన వస్తువులు సేకరించడం ఇష్టం. కానీ, ఎవరైనా జైలుకు వెళ్లడాన్ని ఒక హాబీగా మార్చుకుంటారా? వినడానికే వింతగా ఉన్నా, ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాకు చెందిన ఒక యువకుడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ప్రజలను తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

జైలుకు వెళ్లడమే హాబీ! మూడుసార్లు వెళ్లొచ్చినా తీరని మోజు.. సెంట్రల్ జైలు కోసం ఏకంగా భార్యనే!
Etawah Man Threatens Wife
Balaraju Goud
|

Updated on: Jun 03, 2026 | 6:34 PM

Share

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన హాబీ ఉంటుంది. కొందరికి పుస్తకాలు చదవడం, మరికొందరికి ప్రయాణాలు చేయడం, ఇంకొందరికి ఖరీదైన వస్తువులు సేకరించడం ఇష్టం. కానీ, ఎవరైనా జైలుకు వెళ్లడాన్ని ఒక హాబీగా మార్చుకుంటారా? వినడానికే వింతగా ఉన్నా, ఉత్తరప్రదేశ్‌లోని ఎటావాకు చెందిన ఒక యువకుడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, ప్రజలను తీవ్ర ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు పోలీసుల ముందే నిలబడి, ఎలాంటి భయం లేకుండా తన పూర్తి కథను వివరిస్తూ కనిపించాడు. తనకు సెంట్రల్ జైలును లోపలి నుండి చూడాలనే ఒక వింత కోరిక కలిగిందని, ఆ కోరికను తీర్చుకోవడానికే తాను ఈ ఘాతుకానికి ఒడిగట్టానని అతను చెప్పాడు. జైలుకు వెళ్లడానికి బలమైన కారణం కావాలి కాబట్టి, ఏకంగా తన భార్య ఛాతీకే పిస్టల్ గురిపెట్టి బెదిరించాడు. ఆ తర్వాత స్వయంగా పోలీసుల ముందుకు వెళ్లాడు. ఆ యువకుడి మాటలు, అతను ప్రవర్తిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు.

వీడియోలో ఆ యువకుడు తన పేరు కోమల్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడు. తాను అహేరిపూర్ ప్రాంతంలో కంకర, ఇసుక రవాణా చేయడానికి ట్రాక్టర్ నడుపుతుంటానని తెలిపాడు. విశేషం ఏంటంటే, తాను ఇంతకుముందే మూడుసార్లు ఓరాయ్ జైలుకు వెళ్లొచ్చానని, ఆ జైలుకు వెళ్లడం తనకు చాలా సర్వసాధారణం అయిపోయిందని అతను చెప్పుకొచ్చాడు. ఈసారి ఎలాగైనా ‘సెంట్రల్ జైలు’కు వెళ్లాలనే పట్టుదలతోనే, తన భార్యపై పిస్టల్ గురిపెట్టేంతటి తీవ్రమైన చర్యకు పాల్పడ్డానని వివరించాడు. ఆ వీడియోలో అతను మాట్లాడుతున్నంత సేపూ అతని ముఖంలో ఎలాంటి భయం కానీ, తాను చేసిన తప్పు పట్ల పశ్చాత్తాపం కానీ కనిపించకపోవడం గమనార్హం.

ఈ విషయం పోలీసుల వరకు ఎలా చేరిందని ప్రశ్నించగా, తానే స్వయంగా నడుచుకుంటూ పోలీసు స్టేషన్‌కు వెళ్లానని ఆ యువకుడు సమాధానమిచ్చాడు. అంతేకాదు, తాను భార్యను బెదిరించడానికి ఉపయోగించిన పిస్టల్‌ను, మందుగుండు సామగ్రిని కూడా పోలీసులకే అప్పగించేశాడు. కేవలం జైలుకు వెళ్లాలనే ఏకైక ఉద్దేశంతోనే ఇదంతా చేశానని గర్వంగా చెబుతూ, చివర్లో కెమెరా వైపు చూసి నవ్వి, చేతులు ఊపాడు. ఈ వింత చేష్టలు ఈ వీడియోపై మరింత మంది దృష్టిని ఆకర్షించేలా చేశాయి.

మరోవైపు తన భార్య గురించి మాట్లాడుతూ.. ఆమెతో తనకు పెద్దగా గొడవలేమీ లేవని, తనకు తన భార్య అంటే ఇష్టమని, ఆమె నుండి విడిపోవడం తనకు అస్సలు ఇష్టం లేదని పదేపదే చెబుతున్నాడు. తమకు పెళ్లై చాలా కాలమైనా పిల్లలు లేకపోవడం వల్లే ఇంట్లో తరచుగా చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయని అన్నాడు. అయితే, అతని మాటల తీరు, మొత్తం వ్యవహారాన్ని గమనించిన సోషల్ మీడియా వినియోగదారులు అతని మానసిక స్థితిపై రకరకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

వీడియోను ఇక్కడ చూడండి..

ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షమవగానే నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని హెచ్చరిస్తుంటే, మరికొందరు ఆ యువకుడి వింత అలవాటు పట్ల జోకులు పేల్చుతున్నారు. “ఒక వ్యక్తి జైలును ఒక టూరిస్ట్ ప్లేస్‌గా పొరబడటం బహుశా ప్రపంచంలో ఇదే మొదటిసారి కాబోలు” అని ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. “సెంట్రల్ జైలును సందర్శించడం ఏంటి సామీ? ఇది ఏదో సినిమా కథలా ఉంది” అని మరొకరు రాశారు. “భార్యను తుపాకీతో బెదిరించడం అస్సలు తమాషా కాదు, ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆ యువకుడు మానసికంగా అస్వస్థుడని, అతనికి శిక్ష కంటే ముందు మంచి మానసిక వైద్య నిపుణుడితో చికిత్స అవసరమని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us