AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: కుళ్లిపోయి పురుగులు పట్టిన మామిడి పండ్లతో జ్యూస్ తయారీ! వీడియో చూస్తే వాంతులే..

గుజరాత్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు కుళ్లిపోయి, పురుగులు పట్టిన మామిడి పండ్లతో జ్యూస్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీని పట్టుకున్నారు. టన్నుల కొద్దీ పాడైన మామిడి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి కల్తీ జ్యూస్ తాగడం వల్ల ఆహార విషబాధ, జీర్ణ సమస్యలు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరించారు.

Video: కుళ్లిపోయి పురుగులు పట్టిన మామిడి పండ్లతో జ్యూస్ తయారీ! వీడియో చూస్తే వాంతులే..
Mango Juice Adulteration
SN Pasha
|

Updated on: Jun 03, 2026 | 6:57 PM

Share

చాలా మంది మ్యాంగో జ్యూస్‌ను ఇష్టంగా తాగుతుంటారు. కానీ ప్రజల్లో ఉన్న ఇష్టాన్నే కొంతమంది స్వార్థపరులు తమ వ్యాపార మార్గంగా మార్చుకుంటూ, కుళ్లిపోయిన మామిడి పండ్లతో జ్యూస్ తయారు చేస్తూ జనాల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. తాజాగా కుళ్లిపోయి పురుగులు పట్టిన మామిడి పండ్లను ఓ జ్యూస్ తయారీ ఫ్యాక్టరీలో ఫుడ్ సేప్టీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో భారీ ఆహార కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జ్యూస్ తయారీ కోసం నిల్వ ఉంచిన టన్నుల కొద్దీ కుళ్లిన మామిడి పండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తిగా బూజు పట్టి, లోపల పురుగులతో నిండిపోయిన ఈ పండ్లను చూసి అధికారులు సైతం విస్తుపోయారు.

బుధవారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ విభాగం అధికారులు సంబంధిత గోదాంపై దాడులు నిర్వహించారు. తనిఖీల సమయంలో పెద్ద మొత్తంలో కుళ్లిపోయిన మామిడి పండ్లు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ పండ్లను జ్యూస్, పల్ప్ తయారీ కోసం వినియోగించే అవకాశం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే వాటిని సీజ్ చేసి నమూనాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం స్వాధీనం చేసుకున్న పండ్లలో చాలా వరకు పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. కొన్ని పండ్లపై బూజు పేరుకుపోగా, మరికొన్నింటిలో పురుగులు కనిపించాయి. ఇటువంటి పండ్లతో తయారయ్యే ఆహార పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటి వినియోగం వల్ల ఆహార విషబాధ, జీర్ణ సంబంధిత సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.

ఈ ఘటనపై స్పందించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే లైసెన్సులు రద్దు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలు చేపడతామని తెలిపారు. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆహార కల్తీ, నాసిరకం ఆహార పదార్థాల తయారీపై తనిఖీలు ముమ్మరం చేసిన నేపథ్యంలో గుజరాత్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మరోసారి ఆహార భద్రత అంశాన్ని చర్చనీయాంశంగా మార్చింది. వినియోగదారులు కూడా ఆహార పదార్థాల నాణ్యత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us