పెంపుడు కుక్కల బెడద నివారణకు మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పెంపుడు శునకాల యజమానులపై పన్ను విధింపు చట్టం తీసుకువచ్చింది. ఈ మేరకు పెంపుడు కుక్కల యజమానుల నుంచి పన్ను వసూలు చేయాలనే తీర్మానాన్ని 40 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఆదివారం (జనవరి 15) ఏకగ్రీవంగా ఆమోదిం తెలిపారు. దీనిపై సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టం ముసాయిదాను రూపొందించింది. ఇది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. సాగర్ నగర వీధుల్లో కుక్కల బెడద పెరుగుతుండడంతో కుక్కల యజమానులపై పన్ను విధించాలని మున్సిపాలిటీ నిర్ణయం తీసుకుంది.
వీధి కుక్కలతోపాటు పెంపుడు కుక్కల మల మూత్ర విసర్జనల వల్ల బహిరంగ ప్రదేశాల్లో పెరుగుతున్న మురుగు దృష్ట్యా తాజా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెంపుడు కుక్కల వివరాలను నమోదు చేయడం తప్పనిసరి. అలాగే వాటికి టీకాలు వేయించడంతోపాటు పెంపుడు జంతువుల యజమానులు భద్రత, పరిశుభ్రత పన్ను కట్టవల్సి ఉంటుందని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ బృందావన్ అహిర్వార్ తెలిపారు. కుక్కలు మనుషులను కరిచిన ఘటనలు అనేకం ఉన్నాయని కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించినట్లు ఆయన పేర్కొన్నారు. పెంపుడు కుక్కలను పెంచే వారి వల్ల నగరమంతా చెత్తాచెదారంతో నిండిపోతున్న నేపథ్యంలో పన్ను విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సాగర్ మునిసిపల్ కమీషనర్ చంద్రశేఖర్ శుక్లా అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.