Variety Protest: ప్లాస్టిక్ సర్పాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎందుకంటే..?

Plastic Snakes Protest: ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను చేపట్టకపోవడంపై మధ్యప్రదేశ్‌లోని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లాస్టిక్ పాములను ప్రదర్శిస్తూ మీడియా దృష్టిని ఆకర్షించారు. ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం పాములా కూర్చొందని ఆరోపించారు. వెంటనే ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Variety Protest: ప్లాస్టిక్ సర్పాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన.. ఎందుకంటే..?
Mp Congress Mlas Protest With Plastic Snakes

Updated on: Mar 12, 2025 | 3:48 PM

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్లాస్టిక్ పాములను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. అధికార బీజేపీ ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలపై “పాములా” కూర్చొందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రతిపక్ష నేత ఉమాంగ్ సింఘర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనంలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు బుట్టలు, ప్లకార్డులలో ప్లాస్టిక్ పాములను ప్రదర్శించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ బీజేపీ సర్కారుకి వ్యతరేకంగ నినాదాలు చేశారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకీ పెరుగుతోందని సింఘర్ ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసు, విద్య, నీటిపారుదల, ఆరోగ్యం వంటి ప్రభుత్వ శాఖలలో భారీగా ఖాళీలు ఉన్నా.. ఎందుకు నియామకాలు చేపట్టడంలేదని ప్రశ్నిచారు. బిజెపి ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను పాములా కాటువేస్తోందని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం ఉద్యోగాలపై పాములా పగబట్టిందని ఆరోపించారు. అందుకే, నిరుద్యోగ సమస్యపై నిద్రావస్తలోని ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ఈ వినూత్న నిరసన చేపట్టినట్లు తెలిపారు. ఒక్క విద్యా శాఖలోనే 70,000 కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.

ప్లాస్టిక్ పాములతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన.. వీడియో

కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన

కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసనపై ఆ రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారంగ్ స్పందిస్తూ.. ప్రతిపక్ష నాయకులు ఫోటోల కోసం. మీడియా దృష్టిని ఆకర్షించడానికి అసెంబ్లీ భవన ప్రాంగణాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సభ్యులు ప్లాస్టిక్ పాములతో మీడియా ప్రచారాన్ని కోరుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ సభ్యులు సభకు బయట ఇలాంటి నాటకాలు, జిమ్మిక్కులను మానుకుంటే మంచిదన్నారు.