Ayodhya: అయోధ్యలో అడుగడుగునా అధ్మాత్మికత శోభ.. సోలార్ సిటీగా రూపుదిద్దుకోనున్న నగరం

|

Aug 03, 2023 | 7:39 PM

అయోధ్య.. ఆల్ దివే. అడుగడుగునా అధ్మాత్మికత శోభతో పాటు ఆధునిక హంగులు... పర్యావరణ హితం కూడా! సూర్యవంశోద్ధారకుడి నెలవు ఇక మీదట సౌరశక్తివంతం కాబోతోంది. ఎస్.. వందకు వందశాతం సోలార్ సిటీగా మారబోతోంది అయోధ్య నగరం. రామమందిరంతోపాటు.. దానికి సమాంతరంగా.. అయోధ్య నగరానికి కూడా సరికొత్త మెరుగులు దిద్దుతోంది యూపీ ప్రభుత్వం. అందులో భాగంగా.. అయోధ్యను సౌర నగరంగా రూపొందించేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్దం చేసింది.

Ayodhya: అయోధ్యలో అడుగడుగునా అధ్మాత్మికత శోభ.. సోలార్ సిటీగా రూపుదిద్దుకోనున్న నగరం
Ayodhya Temple
Follow us on

2020 ఆగస్టు 5న ప్రధాని మోదీ భూమిపూజతో ప్రారంభమైన అయోధ్య రామాలయ నిర్మాణం కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే 80 శాతం మేర పనులు పూర్తి చేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటోంది. వచ్చే జనవరి నాటికి రాఘవుడి దర్శనభాగ్యం ఖాయం అంటోంది యూపీ ప్రభుత్వం. రామమందిరంతో పాటు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా పుదిద్దుకుంటున్నాయి. ప్రాంగణంలోకి దారితీసే 24 మెట్ల మార్గం… ఆలయ సింహద్వార నిర్మాణం… ప్రతి స్తంభం మీద దేవతామూర్తుల ప్రతిమలు… ఇలా అనేక ప్రత్యేకతలతో రాజస్థాన్ నుంచి తెచ్చిన పాలరాళ్లతో నిర్మితమవుతోంది అయోధ్య రామాలయం. మరో విశిష్టత ఏంటంటే మూడంతస్థుల్లో జరుగుతున్న గర్భగుడి నిర్మాణం… అందులో మూడడుగుల శ్రీరాముడి విగ్రహం… సూర్యోదయం వేళ తొలి కిరణం రాముడి విగ్రహంపై పడేలా అరుదైన ఆర్కిటెక్చర్.

సూర్యోదయం మాత్రమే కాదు.. రాముడి సన్నిధిలో కురిసే సకల సూర్యరశ్మీ రాముడికే సొంతం కాబోతోంది. ఎస్.. యావత్ అయోధ్యానగరం సౌర నగరిగా ఆవిష్కృతం కాబోతోంది. అయోధ్యను సోలార్ సిటీగా రూపొందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది యూపీలో యోగీ సర్కార్. సూర్యవంశీ కేరాఫ్ సోలార్ సిటీ అన్నమాట. ఆధ్యాత్మిక నగరంగానే కాదు.. అణువణువునా పరిశుద్ధత పరిఢవిల్లే ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటోంది అయోధ్య. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎకో ఫ్రెండ్లీ సిటీగా రాబోతోంది. ఇక్కడ వాడే ఇంధనం సైతం క్లీన్ అండ్ గ్రీన్. అయోధ్యలో 40 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌కి హో ఎహెడ్ చెప్పింది యోగీ క్యాబినెట్. రాంపూర్ హల్వారా గ్రామం సమీపంలో, సరయూ నదీ తీరంలో 165 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ నిర్మించేలా యూపీ సర్కార్, NTPC మధ్య ఒప్పందం కుదిరింది. అయోధ్య సోలార్ సిటీ కోసం 160 కోట్ల బడ్జెట్ కేటాయింపు కూడా జరిగింది. నగరమంతా సౌరవిద్యుత్‌తోనే నడిచేలా ఏర్పాట్లు జరుగుతాయి. ఇందుకోసం ఏడు కోట్ల యూనిట్ల సోలార్ విద్యుత్ ప్రొడ్యూస్ చేసేలా ప్లాంట్లు సిద్ధమవుతాయి. ఇలా ఉత్పత్తయ్యే పవర్ ట్రాన్స్‌మిషన్ కోసమే 9 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా గ్రిడ్ నిర్మాణం కాబోతోంది. ఈవిధంగా ఇండియాలోనే సెకండ్ సోలార్ సిటీగా అవతరించబోతోంది అయోధ్య.

దేశంలోకెల్లా మొట్టమొదటి సోలార్ సిటీ… మధ్యప్రదేశ్‌లోని సాంచి… ఇప్పుడిది తుదిదశలో ఉంది. మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ప్రభుత్వం దీన్నొక ఛాలెంజ్‌గా తీసుకుని పూర్తి చేస్తోంది. ఇప్పుడు యూపీ వంతు. సంప్రదాయ విద్యుత్‌కు పూర్తిగా దూరంగా జరిగి… సౌరవిద్యుత్ వెలుగులతో విరాజిల్లబోతోంది అయోధ్య నగరం. అయోధ్యలో మూడు దశలుగా జరుగుతున్న రామాలయ నిర్మాణం 2025 డిసెంబర్‌ నాటికి పూర్తవుతుంది. అయోధ్యరాముడి దర్శన భాగ్యం కోసం ఇప్పటికే దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అన్ని దిక్కులూ అయోధ్యకు దారితియ్యబోతున్నాయి. అందుకే.. అయోధ్యనగరాన్ని ఆధ్యాత్మిక పరిమళాలే కాదు… అత్యంత అరుదైన ప్రత్యేకతలతో తీర్చిదిద్దేలా శ్రమిస్తోంది యూపీ సర్కార్. దివ్య, భవ్య రామమందిరం.. అందులో కొలువుండే సూర్యవంశి దర్శనం.. ఈమొత్తానికి నెలవు అయోధ్యనగరం కూడా సౌరశక్తిమంతం కావడం అత్యంత అరుదైన విషయం.

మరిన్ని జాతీయ వార్తల కోసం..