జామ్ము కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు-2021 కు లోక్ సభ శనివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న దీనికి తగిన సమయంలో మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ పునర్విభజన బిల్లుకు అనుకూలంగా మాట్లాడిన ఆయన.. జమ్మూ కాశ్మీర్, లడాఖ్ అంశాలను రాజకీయం చేయరాదని విపక్షాలను కోరారు. రాజకీయ పోరాటానికి రావాలని ఉంటే మొదట ‘రింగు’ లోకి రావాలని, దాన్ని పూర్తి చేద్దామని అన్నారు. ఎవరూ భయపడబోరన్నారు. జమ్మూ కాశ్మీర్,లడాఖ్ ఈ దేశ కీలక ప్రాంతాలని, వీటికి తగిలిన ‘గాయాలను’ మనం మాన్పవలసి ఉందని అయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తిని ఇవ్వడంలేదని ఎక్కడా రాసి పెట్టలేదన్నారు. అసలు ఎక్కడి నుంచి మీరీ నిర్ధారణకు వచ్చారని విపక్ష సభ్యులను ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లుకు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తికి సంబంధం లేదని అమిత్ షా స్పష్టం చేశారు. తగిన సమయంలో మాత్రం రాష్ట్ర ప్రతిపత్తిని ఇవ్వడం ఖాయమన్నారు.
(కాగా-జమ్మూ కాశ్మీర్ ఆలిండియా సర్వీసెస్ ఆఫీసర్ కేడర్ ని అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం యూనియన్ టెరిటరీ కేడర్ లో విలీనం చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది).
మొదట ఈ బిల్లును కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. అటు-ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇందుకు ఆర్డినెన్స్ అవసరమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు అదేపనిగా ఆర్డినెన్స్ జారీ చేయడం మంచిది కాదని, అత్యవసర పరిస్థితుల్లోనే జారీ చేయాలనీ ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ కి 370 అధికరణాన్ని రద్దు చేసి..కేంద్రం అక్కడి ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిందని ఆయన ఆరోపించారు.వారికి ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తామని ఊరించిందని అన్నారు. ఎలాంటి ప్రిపరేషన్ లేకుండానే ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేసే చర్య తీసుకుందనడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టడమే నిదర్శనంగా కనబడుతోందని అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Republic Day Violence: రైతు ఉద్యమం ఎఫెక్ట్.. దీప్ సిద్ధూను ఎర్రకోటకు తీసుకెళ్లిన పోలీసులు.. ఎందుకంటే..?
మరిన్ని చదవండి ఇక్కడ: ఉత్తరాఖండ్ లో ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు, 34 మందిని కాపాడేందుకు ముమ్మర యత్నాలు