తమిళనాడులో విరుదునగర్ లోక్‌సభ స్థానం హాట్‌సీట్‌గా మారింది. కాంగ్రెస్ కంచుకోటలో మొట్టమొదటిసారి త్రిముఖ పోరు జరగబోతోంది. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మాణిక్కం ఠాకుర్‌పై విజయ్‌కాంత్ తనయుడు విజయ ప్రభాకరన్, బీజేపీ తరపున సినీనటి రాధిక శరత్ కుమార్ తలపడుతున్నారు.
దక్షిణ తమిళనాడులోని విరుదునగర్ నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోట. 2009, 2019లో కాంగ్రెస్- డీఎంకే కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలుచుకుంది. అయితే 2014లో అన్నాడీఎంకే ఈ స్థానాన్ని గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో అన్నాడీఎంకె, డీఎంకే కూటముల మధ్య ఉండే పోటీ ఇప్పుడు త్రిముఖ పోటీగా మారింది. సినిమా గ్లామర్ ఉన్న అభ్యర్థులు ఈసారి పోటీలో ఉండడంతో లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్ స్థానం వీఐపీ నియోజకవర్గంగా మారింది. విరుదునగర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా సినీ నటి రాధికా శరత్‌కుమార్, అన్నాడీఎంకే కూటమిలో డీఎండికే అభ్యర్థిగా దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ మళ్లీ పోటీలో ఉండటంతో విరుదునగర్ నియోజకవర్గం తమిళనాట అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
దక్షిణ తమిళనాడు లోని విరుదునగర్ జిల్లాలో దేవర్, నాడార్, నాయుడు సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. మాజీ ముఖ్యమంత్రి కర్మవీర కామరాజు పుట్టిన నేల. దీంతో సహజంగానే నాడార్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ మద్దతుదారులే. నాడార్లలాగే నాయుడు వర్గం ఓటర్లు కూడా అధికసంఖ్యలో విరుదునగర్‌లో నివసిస్తున్నారు. దీంతో నటుడు శరత్ కుమార్ కంటే నటి రాధిక పోటీలో ఉంటేనే శరత్‌కుమార్ నాడార్ సామాజికవర్గం ఓట్లతో పాటు రాధికాకు చెందిన నాయుడు సామాజికవర్గ ఓట్లను కూడా రాబట్టుకోవచ్చని బీజేపీ వ్యూహం. నటుడు శరత్ కుమార్ ఎస్‌ఎంకే పార్టీని బీజేపీలో విలీనం చేయడం నాడార్ సామజిక వర్గానికి, ఆ పార్టీ కార్యకర్తలకు కొంతమేర మింగుడుపడని విషయంగా మారింది. నాడార్లలో ఉన్న వ్యతిరేకత డీఎంకే కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. మాణిక్కం ఠాకూర్‌కు తన దేవర్ వర్గం సామజిక వర్గం ఓట్లతో పాటు డీఎంకే ఓట్లు బలంగా ఉన్నాయి.
మరోవైపు గెలుపు కోసం అన్నాడీఎంకే కూడా తన వంతు రాజకీయాన్ని మొదలుపెట్టింది. నాయుడు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కూటమిలో భాగంగా డీఎండీకేకు ఈ స్థానాన్ని కేటాయించడంతో ఆ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ్ ప్రభాకరన్‌ను డీఎండీకే బరిలో నిలపడంతో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది.
సినీ గ్లామర్‌ను చూసి ప్రజలు ఓటు వేయరని, రాజకీయాలలో ఉంటూ ప్రజలకి సేవ చేసే తననే గెలిపిస్తారని మాణికం ఠాకూర్ ధీమా వ్యక్తం చేశారు. అయితే తనకు రాజకీయాలు కొత్త కాదని, సినిమా వాళ్ళు రాజకీయాలలో ఎందుకు అనుకునే వారికి గెలిచి సమాధానం చెబుతానని రాధిక అంటున్నారు. ఇక తన తండ్రి అడుగుజాడల్లో నడవడానికి, ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం కల్పించాలని విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకరన్ విజ్ఞప్తి చేస్తు్న్నారు. విజయ్‌కాంత్ ఇటీవలే మరణించడంతో సానుభూతి పవనాలు విజయప్రభాకరన్‌కు కలిసి వస్తాయని అభిమానులు అంచనావేస్తున్నారు. దీంతో విరుదునగర్ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
దేశవ్యాప్తంగా కనీసం 370 స్థానాల్లో గెలిచి సత్తా చాటాలనుకుంటోన్న బీజేపీ తమిళనడుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. విరుదునగర్‌లో ఈసారి సినీ గ్లామర్‌తో చేసే ప్రయోగంపై ఆశలు పెట్టుకుంది. దీనికి తోడు మోదీ, అన్నామలై ప్రభావం విరుదునగర్‌లో సక్సెస్ మంత్రగా మారుతుందని కమలనాథులు అంచనావేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…