Bihar Complete Lockdown: దేశంలో కరోనా వైరస్ విలయతాండవం కొనసాగుతోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌లో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే.. మహారాష్ట్రలో వైరస్ తగ్గుముఖం పట్టడానికి లాక్‌డౌన్ విధించడం కూడా తోడ్పడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా సాగుతున్నాయి. ఢిల్లీ, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్‌డౌన్ కొనసాగుతోంది. తాజాగా బీహార్ కూడా లాక్‌డౌన్ జాబితాలో చేరింది. మే 15 వరకు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై క్యాబినెట్ మంత్రులు, అధికారులతో చర్చించిన తర్వాత లాక్‌డౌన్ అమలుచేయాలని నిర్ణయించినట్టు నితీశ్ తెలిపారు. లాక్‌డౌన్‌కు సంబంధించి విధి విధానాలను, మార్గదర్శకాలను వెల్లడిస్తామన్నారు.
సోమవారం క్యాబినెట్‌లోని మంత్రులు, అధికారులతో చర్చించిన తరువాత మే 15 వరకూ బీహార్‌లో లాక్‌డౌన్ అమలు చేయాలని నిర్ణయించామన్నారు. దీనిపై వివరణాత్మక మార్గదర్శకాలు, ఇతర కార్యకలాపాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోవిడ్ సంక్షోభ నిర్వహణ బృందానికి సూచించామని సీఎం నితీశ్ వెల్లడించారు. బిహార్‌లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో వైరస్ వ్యాప్తి కట్టడికి లాక్‌డౌన్ అమలకు నితీశ్ మొగ్గుచూపారు. గడచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 11వేల407 కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. దీంతో బీహార్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షలు దాటింది.
రాష్ట్రంలో వేల సంఖ్యలో కొత్త కేసుల నమోదవటంతో పాటు వందల మంది కరోనా బాధితులు మరణిస్తున్నారు. బీహార్‌లో ఇప్పటి వరకు రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగింది. అయినప్పటికీ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. బీహార్లో పలు ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు కావాల్సిన బెడ్లు, ఆక్సిజన్, మందులు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పూర్తిగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు నితీష్ ప్రకటించారు.
Also Read: