Ashish Mishra Released From Jail: దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన లఖీంపూర్ ఖేరి (Lakhimpur Kheri) లో జరిగిన హింసాత్మక ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా (Ashish Mishra) కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశిష్ మిశ్రా జైలు నుంచి విడుదలయ్యారు. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ గత వారం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై విడుదలకు ముందు నిబంధనల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే విడుదల చేసినట్టు లఖీంపుర్ ఖేరి జైలు సూపరింటెండెంట్ పీపీ సింగ్ తెలిపారు. అయితే.. రూ.3లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించిందన్నారు. నగరం వదిలి వెళ్లే అంశంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తన కుమారుడు ఆశిష్ మిశ్రా నివాసానికి చేరుకున్నారు.
లఖింపుర్ ఖేరి కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ గత అక్టోబర్ మాసంలో అరెస్టయ్యారు. అనంతరం పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అయితే, ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మొదలైన రోజే భాజపా నేత ఆశిష్ మిశ్రాకు బెయిల్ లభించడం గమనార్హం. కాగా.. లఖీంపూర్ కేసులో.. గత అక్టోబర్ 9న ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించి రిమాండ్‌కు తరలించారు. అయితే పలుమార్లు బెయిల్ నిరాకరించిన కోర్టు గత గురువారం బెయిల్ మంజూరు చేసింది. అయితే.. యూపీ ఎన్నికలు ప్రారంభం రోజే మిశ్రాకు బెయిల్ లభించడంపై పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి.
గత ఏడాది అక్టోబర్ 3న కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో రైతుల మీదుగా వాహనాలు దూసుకెళ్లడంతో నలుగురు రైతులతోపాటు కారు డ్రైవర్, జర్నలిస్టు, మరో ఇద్దరు కలిపి మొత్తం 8 మంది మృతి చెందారు. రైతులపైకి దూసుకెళ్లిన వాహనాల్లో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా నడుపుతున్నాడనే అభియోగంపై అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించి చార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read: