లేడీ సింగమ్ కాదు.. లంచాల సింగమ్! కేసులో కీలక అప్డేట్
మధ్యప్రదేశ్ పోలీసు అధికారిణి, ‘లేడీ సింగం’గా పేరొందిన నేహా పచిసియాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. హత్య కేసు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు తక్కువ ధరకు భూమి విక్రయించడంలో లబ్ధి చేకూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. నేహాతో పాటు మరో ఆరుగురు పోలీసులపై చర్యలు తీసుకున్నారు.

మధ్యప్రదేశ్‌లో ఒకప్పుడు ‘లేడీ సింగం’గా పేరు తెచ్చుకున్న పోలీసు అధికారిణి నేహా పచిసియా చుట్టూ వివాదాలు మరింత ముదురుతున్నాయి. కట్నీ సస్పెండ్ అయిన సీఎస్పీ నేహా పచిసియాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసు దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ని ఏర్పాటు చేశారు. ఓ హత్య కేసు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు, వివాదాస్పద భూ లావాదేవీలో అతడికి ప్రయోజనం కలిగించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. ఆగస్టు 19న కట్నీలోని కుత్లా పోలీస్ స్టేషన్‌లో 37 ఏళ్ల నేహా పచిసియాతో పాటు మరో ఇద్దరు పోలీసు సిబ్బందిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును జబల్‌పూర్ సిటీ అదనపు ఎస్పీ అంజనా తివారీ దర్యాప్తు చేస్తున్నారు. ఆమెకు ఎస్ఐటీ సహకరిస్తుందని జబల్‌పూర్ జోన్ ఐజీ ప్రమోద్ వర్మ తెలిపారు.
కట్నీ ఎస్పీ అభినయ్ విశ్వకర్మ వెల్లడించిన వివరాల ప్రకారం.. హత్య కేసులో నిందితుడైన రమేష్ లోధిని అరెస్టు చేయడంలో ఆలస్యం జరిగిందనే ఆరోపణలు మొదట వెలుగులోకి వచ్చాయి. పోలీసులు అతడిని అరెస్టు చేసినప్పటికీ, నిర్ణీత 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో జూలై మొదటి వారంలో లోధికి డిఫాల్ట్ బెయిల్ లభించింది. దర్యాప్తును సమీక్షించిన ఎస్పీ, ప్రాథమిక విచారణకు ఆదేశించగా కేసులో అనుమానాస్పద అంశాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
విచారణలో మరో కీలక విషయం బయటపడింది. లోధి, అతని కుటుంబానికి చెందిన భూమిని మారుఫ్ అహ్మద్ హనాఫీకి రూ.18 లక్షలకు విక్రయించినట్లు తేలింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆ భూమి విలువ సుమారు రూ.82 లక్షలు కాగా, మార్కెట్ విలువ దాదాపు రూ.2 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తక్కువ ధర లావాదేవీ వెనుక ఒత్తిడి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశాల మేరకు నేహా పచిసియాను సస్పెండ్ చేశారు. ఆమెతో పాటు మరో ఆరుగురు పోలీసు సిబ్బందిపైనా చర్యలు తీసుకున్నారు. అయితే వారిపై నేరపూరిత ప్రమేయం ఆరోపణలు లేవని, సేవా నిబంధనలకు విరుద్ధమైన ఆదేశాలను పాటించినందుకు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఓ రవాణాదారుడి డంపర్ ట్రక్కును ఆపి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలపై నేహాపై మరో శాఖాపరమైన విచారణ కూడా కొనసాగుతోంది. రాజ్‌గఢ్ జిల్లా పచోర్ తహసీల్‌కు చెందిన నేహా పచిసియా, ఎయిర్ హోస్టెస్‌గా, బహుళజాతి సంస్థల్లో పనిచేసిన అనంతరం 2012లో ఎంఫీపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పోలీసు శాఖలో చేరారు. గుణలో సీఎస్పీగా పనిచేసే సమయంలో మహిళల కోసం మొబైల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో ఆమెకు ‘లేడీ సింగం’ అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఆమెపై నమోదైన కేసులో ఎస్ఐటీ దర్యాప్తు కీలకంగా మారింది.
