Kolkata Doctor Murder Case: 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? సుప్రీం కోర్టు సీరియస్!

|

Aug 22, 2024 | 4:09 PM

కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం, హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడానికి కారణమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Kolkata Doctor Murder Case: 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? సుప్రీం కోర్టు సీరియస్!
Kolkata Doctor Murder Cas
Follow us on

కోల్‌కతాలో డాక్టర్ అత్యాచారం, హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడానికి కారణమేమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాలేజీ ప్రిన్సిపాల్ నేరుగా వచ్చి చర్యలు తీసుకోవాల్సి ఉందని, 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీం కోర్టు ఎవరిని కాపాడుతోంది. ఈ కేసును వైట్‌వాష్ చేసేందుకు ప్రయత్నించారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. విచారణ నిబంధనలను పట్టించుకోలేదు. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో ఆసుపత్రి పాలకవర్గంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రశ్నించారు.

కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం-హత్య ఘటనపై దర్యాప్తునకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సుప్రీంకోర్టులో స్టేటస్ రిపోర్టును సమర్పించింది . ఈ ఘటన దేశవ్యాప్తంగా వైద్యుల సమ్మెకు దారి తీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. దేశం మరో అత్యాచారం కేసు కోసం వేచి ఉండదని, వైద్యులు తిరిగి విధుల్లోకి రావాలని విజ్ఞప్తి చేసింది. ఆసుపత్రులలో వారి భద్రతకు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇందు కోసం నేషనల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కేసు డైరీ హార్డ్ కాపీని సుప్రీంకోర్టు కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 5న జరగనుంది.

గురువారం (ఆగస్టు 22) విచారణ సందర్భంగా, బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది కపిల్ సిబల్, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మధ్య వాదోపవాదాలు జరిగాయి. మా నాయకులకు వ్యతిరేకంగా మాట్లాడే వారి వేళ్లు నరికేస్తానని బెంగాల్ మంత్రి ఒకరు చెబుతున్నారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతలు కూడా కాల్పులు జరపాలని మాట్లాడుతున్నారని అన్నారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత, అన్ని రకాల చర్యల నుంచి రక్షణ కల్పిస్తామని, మీరు తిరిగి విధుల్లో చేరాలని సీజేఐ డీవై చంద్రచూడ్‌ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. “న్యాయం, వైద్యం ఆపలేం. మనం కూడా పని వదిలేసి సుప్రీంకోర్టు బయట కూర్చుంటామా? AIIMS డాక్టర్లు 13 రోజులుగా పని చేయడం లేదు. ఇది సరికాదు. దూర ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. వారి ప్రాణాలను కాపాడాల్సి బాధ్యత వైద్యులపై ఉంది” అని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, డిస్‌స్ట్రెస్‌ కాల్‌ సిస్టమ్‌ను రూపొందించడం వంటి సూచనలు అందించామని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు అలాంటి సూచనలన్నింటినీ టాస్క్‌ఫోర్స్ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. శాంతియుత నిరసనలపై బలప్రయోగం చేయవద్దని గత విచారణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని, నిరసనను అనుమతించే లేదా తిరస్కరించే రాష్ట్ర హక్కును హరించలేదని స్పష్టం చేయాలని సీజేఐ అన్నారు.

బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ రాష్ట్రంలో అసహజ మరణాల కేసుల్లో దర్యాప్తు, ఎఫ్‌ఐఆర్‌కు ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయని, వాటి ప్రకారం పనిచేశామని చెప్పారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ.. ఇది వేరే విషయం.. మృతదేహం దొరికిన 14 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ రాశారు. ప్రిన్సిపాల్‌ వెంటనే ఫిర్యాదు చేసి ఉండాల్సిందని అన్నారు. కాగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ రాజీనామా చేసిన కొంత కాలం తర్వాత ఆయనను మరో కాలేజీలో నియమించింది బెంగాల్ సర్కార్.

ఇక ఈ వ్యవహారంలో దాదాపు పది రోజులుగా మౌనంగా ఉన్న TMC ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ఎట్టకేలకు స్పందించారు. కోల్‌కతా డాక్టర్‌ హత్యా వ్యవహారంలో ఆందోళనలు జరుగుతున్న ఈ పది రోజుల వ్యవధిలో దేశంలో తొమ్మిది వందలకు పైగా అత్యాచారాలు జరిగాయని సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా తెలిపారు. వీటి పరిష్కారం గురించి ఎక్కడా చర్చ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచార కేసుల్లో 50 రోజుల్లో విచారణ పూర్తై, శిక్షలు పడే కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిషేక్‌ బెనర్జీ అభిప్రాపడ్డారు. సమగ్ర చట్టం తెచ్చేలా కేంద్రంపై రాష్ట్రాలన్నీ ఒత్తిడి తేవాలని సూచించారు. ఇది కాకుండా ఏం చేసినా అది కేవలం లాంఛనప్రాయంగా ఉంటుందని తప్ప ఎటువంటి ప్రభావమూ ఉండదని ట్వీట్‌లో అభిషేక్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో తన మేనత్త మమతా బెనర్జీ తీరుపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్నా వేళ అభిషేక్‌ స్పందన TMCలో కలకలం సృష్టిస్తోంది.

మరో వైపు డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన కోల్‌కతాలోని సదరు ఆస్పత్రిలో CISF భద్రత ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో CISF సిబ్బంది ఆస్పత్రి సెక్యూరిటీ విధుల్లో చేరారు. ఈ ఆస్పత్రిలో CISF సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఈ మధ్యే ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..