Kingpin of Cars Theft: ద్యావుఢా.. ఏకంగా 5000 కార్లు చోరీ.. వీడి సిత్రాలు అన్నీఇన్నీ కాదండోయ్..

|

Sep 06, 2022 | 5:02 PM

Kingpin of Cars Theft: చైన్‌ స్నాచింగ్‌లు.. హౌస్‌ బ్రేకింగ్‌లు.. బైకు చోరులు.. కోళ్ల దొంగలు.. ఏటీఎం సెంటర్లలో ఇస్మార్ట్‌ కేటుగాళ్లు.. ఇలాంటోళ్లు ఒకరా ఇద్దరా..

Kingpin of Cars Theft: ద్యావుఢా.. ఏకంగా 5000 కార్లు చోరీ.. వీడి సిత్రాలు అన్నీఇన్నీ కాదండోయ్..
Car Theft
Follow us on

Kingpin of Cars Theft: చైన్‌ స్నాచింగ్‌లు.. హౌస్‌ బ్రేకింగ్‌లు.. బైకు చోరులు.. కోళ్ల దొంగలు.. ఏటీఎం సెంటర్లలో ఇస్మార్ట్‌ కేటుగాళ్లు.. ఇలాంటోళ్లు ఒకరా ఇద్దరా.. ఎవడి గోల వాడిదే.. ఎవడి చిత్రం వాడిదే. అయితే, ఈ సిత్రాలన్నీ ఓ లెక్క. రీసెంట్‌గా ఢిల్లీ తళుక్కమన్న కారు చాటు క్రైమ్‌ కథా చిత్రమ్‌ మరో లెక్క. అవును, ట్రాఫిక్‌ జామైతే కార్లు ఎలా బార్లు తీరుతాయో? అందరికి తెలిసిందే. ఓ వ్యక్తి ఇంచు మించు ఈ సైజులో గ్యారేజీని మేయిన్‌టెయిన్‌ చేశాడు. చివరకు ఇతగాడి సీన్ సితార చేశారు ఢిల్లీ పోలీసులు.

ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఎనీసెంటర్‌ సింగిల్‌ హ్యాండిల్ అనే రేంజ్‌లో 5వేల కార్లలో షికారు చేశాడు. ఒక్కడికి అన్ని కార్లా! అని ముక్కున వేలేసుకునేరు. అసలు కత ఇంకా వుంది. కొనుక్కున్నోళ్లకు ఒకటో రెండు కార్లు ఉండడం పరిపాటే. బాగా డబ్బున్నోళ్లకు వుంటే గింటే పదుల సంఖ్యలో కార్లు ఉండొచ్చు. అదే కొట్టేస్తే.. వందలు కాదు వేల కార్లు. ఘన చోరుడు అనిల్‌ చౌహాన్‌ అదే లాజిక్‌తో ప్రొసీడయ్యాడు. ఏకంగా 5వేల కార్లు కొట్టేశాడు. ఇతను కన్నేశాడంటే ఇక అంతే సంగతులు. ఎంతటి కడక్‌ బండైనా అతని గ్యారేజీలో ఉండాల్సిందే.

కుదిరితే చోరీ.. కుదరకపోవడం అనేదే ఉండదు. ఖూనీ చేసైనా సరే నచ్చిన కారును కొట్టేయడంలో దిట్ట ఈ బడా చోర్‌. చోరీలే షార్ట్‌కట్‌గా.. షార్ట్‌ టైమ్‌లో కోట్లకు ఎదిగాడు అనిల్‌ చౌహాన్‌. దేశంలోనే అతిపెద్ద కార్ల దొంగగా క్రైమ్‌ రికార్డులకు ఎక్కిన ది మోస్ట్‌ వాంటెడ్‌ అనిల్‌ చౌహాన్‌కు ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చెక్‌ పెట్టారు.

ఇవి కూడా చదవండి

దేశ నలుమూలల అనిల్‌ చౌహాన్‌ కార్లను దొంగిలించాడు. కొట్టిసేన కార్లను నేపాల్, జ‌మ్మూక‌శ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో విక్రయించేవాడు. పట్టుపడే అవకాశాలున్నాయని చాలా కార్లను తుక్కు తుక్కు చేసి స్పేర్‌ పార్ట్స్‌గా అమ్మి దండిగా సొమ్ము చేసుకున్నాడు. కార్ల చోరీల్లో ఆరితేరిన అనిల్‌ వయసు 52 ఏళ్లు. 27 ఏళ్ల వయసు నుంచే ఈ దందా చేశాడు. ఆరంభంలోనే సెంచరీ కొట్టాడు. పట్టుపడకపోవడంతో మరింత పేట్రేగాడు. కార్ల కోసం డ్రైవర్లను హత్య చేసిన ఉదంతాలు కూడా వున్నాయి.

ఇంటర్మీడియట్ వరకు చదివిన అనిల్‌.. కాలేజీ మానేసి ఢిల్లీలో ఆటోవాలాగా పనిచేశాడు. కార్ల చోరీతో డబ్బు రుచి మరిగాక.. ఢిల్లీ నుంచి అసోంకు మకాం మార్చాడు. దొంగ సొమ్ముతో భారీగా ఆస్తులు కూడా పెట్టాడు. పొలిటికల్‌ పరిచయాలను నిచ్చెనగా చేసుకుని క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌గా ఎదిగాడు. అదే సమయంలో కార్ల చోరీలను కంటిన్యూ చేశాడు. ఐతే అనిల్‌తో లింకులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో 2015లో రూమీనాథ్‌ అనే ఎమ్మెల్యే మాజీ భర్త జాకీ జకీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత మనీలాండరింగ్‌ వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై, ఈశాన్య రాష్ట్రాల్లో ఆస్తులు కొనుగోలు చేసిన అనిల్‌పై ఈడీ ఫోకస్‌ పెట్టింది. ఆ క్రమంలో 2105 లో అనిల్‌ చౌహాన్‌‌ను జైలు బాటపట్టించింది. ఐదేళ్ల తరువాత 2020లో విడుదలయ్యాడు. మళ్లీ పాత దందాను షూరూ చేశాడు. 5వేలకు పైగా కార్లను కొట్టేసిన అనిల్‌ చౌహాన్‌పై 180 కేసులున్నాయి. కొట్టేసిన కార్లలాగే అనిల్‌ది బిగ్‌ సైజ్‌ ఫ్యామిలీనే. అతనికి ముగ్గురు భార్యలు. ఏడుగురు పిల్లలు. బిందాస్‌ లైఫ్‌.. కోట్లకు ఎదిగినా దొంగ బుద్ది మాత్రం మారలేదు.

కొట్టేసిన కార్లను అమ్మి కోట్లు కూడ బెట్టిన అనిల్‌ చౌహాన్‌లో కక్కుర్తి తగ్గలేదు. యూపీ ఆయుధ మాఫియాతో లింకులు ఏర్పరుచుకున్నాడు. ఆయుధాల స్మగ్లింగ్‌ దందాను దౌడ్‌ తీయించాడు. ఈశాన్య రాష్ట్రాల్లో నిషేధిత ఉగ్ర సంస్థలకు ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులకు ఉప్పందంది. ఇంకేం పక్కా నిఘా పెట్టి వల విసిరితే.. అడ్డంగా బుక్కయ్యాడీ కార్ల దొంగ. అతని నుంచి 6 పిస్టల్స్‌, ఏడు క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

అనిల్‌ చౌహాన్‌ 5వేలకు పైగా కార్లను దొంగిలించినట్టు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణైంది. ఇక అక్రమ ఆయుధ రవాణా వెనుక డేటా తేల్చే పనిలో పడ్డారు ఢిల్లీ పోలీసులు. పనిలో పనిగా అనిల్‌ చౌహాన్‌తో అంటకాగిందెవరనే కోణంలోనూ కూపీలాగుతున్నారు. విచారణలో పొలిటికల్‌ లింకులతో ఎనీ టైమ్‌ బిగ్‌ బ్రేకింగ్‌ తెరపైకి రావచ్చనే చర్చ జోరందుకుంది. ఇప్పటికే లిక్కర్‌ స్కామ్‌ నేషనల్‌ లెవల్‌లో పాలిటిక్స్‌కు టక్కర్‌ ఇవ్వనే ఇచ్చింది. ఈడీ ఇన్‌వాల్వ్‌మెంట్‌తో అనిల్‌ చౌహాన్‌ ఎపిసోడ్‌లోనూ సంచలనాలు తెరపైకి రావొచ్చు అనేది ఢిల్లీ టాక్‌.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..