‘ఖేలా హాబ్’ (ఆట ఆగదు) అనే నినాదంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మళ్ళీ గళమెత్తారు. కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి కూలదోసేంతవరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ఆట ఆగదని ఆమె ప్రకటించారు. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కోల్ కతా లో నిర్వహించిన తమ పార్టీ మద్దతుదారుల ర్యాలీని ఉద్దేశించి వర్చ్యువల్ గా ప్రసంగించిన ఆమె.. భారతీయ జనతా పార్టీపై విరుచుకపడ్డారు. ఆమె ప్రసంగం ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, త్రిపుర, గుజరాత్, యూపీ రాష్ట్రాల్లో కూడా వివిధ భాషల్లో టెలికాస్ట్ కావడం విశేషం. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ ఆట ఆగదు స్లోగన్ లేవనెత్తి విపక్ష సమర శంఖం పూరించారు. ఆగస్టు 16 వ తేదీని ‘ఖేలా దివస్’ (ఆటల దినోత్సవం) గా పాటిస్తామని, ఆ రోజున పేద పిల్లలకు ఫుట్ బాల్స్ పంపిణీ చేస్తామని ఆమె చెప్పారు. అధికారం నుంచి బీజేపీని దింపేంతవరకు అన్ని రాష్ట్రాల్లో ఈ ఖేల్ కొనసాగుతుందన్నారు. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ ని అదుపు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, ఇది ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆమె అన్నారు.
పెగాసస్ వివాదాన్ని ప్రస్తావించిన మమత..ఇండియాను బీజేపీ ప్రజాస్వామిక దేశంగా కాక.. నిఘా (సర్వేలెన్న్) పెట్టే దేశంగా మార్చిందని ఆరోపించారు. ఈ నిఘా కారణంగా తన ఫోన్ తో బాటు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురయ్యాయని, తాను ఎన్సీపీ నేత శరద్ పవార్ తో గానీ,ఇతర విపక్ష నేతలతో గానీ మాట్లాడలేకపోయానని ఆమె అన్నారు. కానీ 2024 ఎన్నికల్లో ఈ ‘గూఢచర్యం’ పని చేయదన్నారు. పెగాసస్ వివాదంఫై సుప్రీంకోర్టు విచారణ చేయాలని మమత కోరారు. వర్చ్యువల్ గా తమ ర్యాలీకి హాజరైన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఇతర విపక్ష నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1993 జులై 21 న కోల్ కతా లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ జరుగుతుండగా జరిగిన పోలీసు కాల్పుల్లో 13 మంది కార్యకర్తలు మరణించారు. వారి స్మృత్యర్థం బెంగాల్ లో ఇలా జులై 21 ని అమరవీరుల దినోత్సవంగా పాటిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: RS Praveen Kumar: RS ప్రవీణ్‌కుమార్‌కు కొత్త చిక్కులు.. కరీంనగర్‌లో కేసు నమోదు..
Hyundai Micro: అతి చిన్న ఎస్‌యూవీ తీసుకువస్తున్న హ్యుందాయ్.. వీడియో