Kerala Gold Scam: గోల్డ్‌, బిర్యానీ ఆందోళనలతో దద్దరిల్లుతున్న కేరళ.. సీఎం రాజీనామా కోసం డిమాండ్‌..

Kerala Gold Scam: డమ్మీ గోల్డ్‌ బిస్కట్లు.. బిర్యానీ పాత్రల ఆందోళనతో కేరళ దద్దరిల్లుతోంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్‌ రాజీనామా..

Kerala Gold Scam: గోల్డ్‌, బిర్యానీ ఆందోళనలతో దద్దరిల్లుతున్న కేరళ.. సీఎం రాజీనామా కోసం డిమాండ్‌..
Gold Scam

Updated on: Jun 10, 2022 | 8:13 AM

Kerala Gold Scam: డమ్మీ గోల్డ్‌ బిస్కట్లు.. బిర్యానీ పాత్రల ఆందోళనతో కేరళ దద్దరిల్లుతోంది. గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎం విజయన్‌ రాజీనామా కోసం విపక్షాలు భారీ ఆందోళన చేపట్టాయి. ముఖ్యమంత్రిపై తప్పుడు ఆరోపణలు చేశారన్న కేసులో స్వప్నాసురేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

కేరళలో గోల్డ్‌.. బిర్యానీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. గోల్డ్‌స్కామ్‌పై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. స్కాంలో సీఎం విజయన్‌, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కేరళ హైకోర్టు కొట్టేసింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి స్వప్న స్కాంపై మాట్లాడారని, సీఎం విజయన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర చేశారని మాజీ మంత్రి కేటీ జలీల్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదయ్యింది. అయితే సీఎం విజయన్‌ రాజీనామా కోసం డిమాండ్‌ చేస్తూ విపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను చేపట్టాయి.

బిర్యానీ పాత్రలతో, డమ్మీ గోల్డ్‌ బిస్కట్లతో కాంగ్రెస్‌ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. దుబాయ్‌ రాయబార కార్యాలయం నుంచి బ్యాగ్‌ల్లో బంగారం స్మగ్లింగ్‌ చేశారని, సీఎం మాజీ సెక్రటరీ శివశంకర్‌ ఆ బ్యాగ్‌లను తీసుకున్నారని స్వప్నా సురేశ్‌ ఆరోపించారు. అంతేకాకుండా UAE కాన్సులేట్‌ నుంచి సీఎం నివాసానికి పంపించిన బిర్యానీ పాత్రల్లో కూడా బంగారం స్మగ్లింగ్‌ చేశారని సంచలన ఆరోపణలు చేశారు స్వప్నా సురేశ్‌. అందుకే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు బిర్యానీ పాత్రలతో, డమ్మీ బంగారం బిస్కెట్లతో ఆందోళన చేశారు. మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు సీఎం విజయన్‌ దిష్టిబొమ్మను తగులబెట్టారు.

కేరళ సెక్రటేరియట్‌ను ముట్టడించడానికి ప్రయత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు. కొచ్చిలో కూడా గోల్డ్‌స్కాంపై ఆందోళనలు కొనసాగాయి. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ముఖ్యమంత్రి విజయన్‌పై ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపించారు స్వప్నాసురేశ్‌. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చట్టప్రకారమే ఆమెపై చర్యలు ఉంటాయని ఎల్‌డీఎఫ్‌ నేతలు చెబుతున్నారు. స్వప్నా సురేశ్‌ డ్రామాలను ప్రజలు నమ్మడం లేదన్నారు.