ముంబయి, అక్టోబర్ 22: జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన వారికి క్షత్రియ కర్ణి సేన పార్టీ భారీ నజరానా ప్రకటించింది. ఈ మేరకు క్షత్రియ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు రాజ్ షెకావత్ ప్రకటన వెలువరించారు. బిష్ణోయ్ వంటి గ్యాంగ్‌స్టర్ల ప్రభావం నానాటికీ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో ప్రకటన చేశారు. ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోలో లారెన్స్ బిష్ణోయ్‌ని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుకు కోటి రూపాయలకు పైగా రివార్డు ఇస్తానని రాజ్ షెకావత్ ప్రకటించాడు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారి, అతని కుటుంబ సభ్యుల పూర్తి భద్రత క్షత్రియ కర్ణి సేనదే అని ఆయన హామీ ఇచ్చాడు. బిష్ణోయ్ గ్యాంగ్ ఎన్ని హత్యలకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వం, గుజరాత్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మా అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడిని చంపిన వారిని వదిలేది లేదని ఆయన వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. కాగా 2023, డిసెంబర్‌లో రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. అనంతరం ఆయనను తామే హత్య చేసినట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది.
ఇక లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అతడు అక్కడ చాలా కాలంగా శిక్ష అనుభవిస్తున్నప్పటికీ.. అతడి సూచనల మేరకు బిష్ణోయ్ గ్యాంగ్ అరాచకాలకు పాల్పడుతుంది. ముంబైలో మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో సహా పలు హై ప్రొఫైల్ నేరాల్లో లారెన్స్ బిష్ణోయ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. దసరా రోజున బాంద్రాలో సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. ఆ మరుసటి రోజే ఈ దాడికి బాధ్యత వహిస్తూ బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు షూటర్లు సహా 10 మంది వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ అరెస్టు చేసింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు కూడా గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. ఇటీవల ముంబై పోలీసుల వాట్సాప్ గ్రూప్‌లో కూడా సల్మాన్ హత్య బెదిరింపులు వచ్చాయి.
ముఖ్యంగా సిద్ధిక్ హత్య తర్వాత.. సల్మాన్ భద్రతను మరింత పెంచారు. గత ఏడాది సెప్టెంబరులో, ఖలిస్తానీ సానుభూతిపరుడు సుఖా దునేకే హత్యకు కూడా బిష్ణోయ్ ముఠా బాధ్యత వహించింది. ఈ గ్యాంగ్ సభ్యులు కెనడాలోని AP ధిల్లాన్, గిప్పీ గరేవాల్ ఇళ్ల వెలుపల కూడా కాల్పులకు పాల్పడ్డారు. బిష్ణోయ్ నేర సంస్థ దేశవిదేశాల్లో చురుకుగా ఉందనడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలి. ఎన్నో యేళ్లుగా ఈ ముఠా అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడింది. డాన్ దావూద్ ఇబ్రహీంతో అతడికి సత్సంబంధాలు ఉండటం వల్లే ఈ హత్య చేసినట్లు బిష్ణోయ్ గ్యాంగ్ పేర్కొంది. ఈ క్రమంలో ప్రస్తుతం జైల్లో ఉన్న అతడిని ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులకు రూ.కోటికి పైగా రివార్డు ఇస్తామని క్షత్రియ కర్ణి సేన రివార్డ్ ప్రకటించడం చర్చణీయాంశంగా మారింది.