Corona Vaccine: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ వ్యాక్సినేషన్ మూడో దశలో భాగంగా మే 1 నుంచి 18-44 ఏళ్ల వయసు వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేసేందుకు కోటి డోసులను కొనుగోలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. తొలి దశ టీకా కార్యక్రమం కోసం రూ.400 కోట్లు కేటాయించినట్లు ఆయన చెప్పారు. 18 ఏళ్లు పైబడిన వారంతా ఈ నెల 28 నుంచి తమ పేర్లను రిజిష్టర్ చేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మరో వైపు కర్ణాటకలో గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 25,795 కరోనా కేసులు, 123 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల మొత్తం సంఖ్య 12,47,997కు, మొత్తం మరణాల సంఖ్య 13,885కు చేరింది. ప్రస్తుతం 1,96,236 యాక్టివ్ కేసులున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ.. మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా కేసులను నియంత్రించాలంటే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. 18ఏళ్లు పైబడిన వారందరికీ.. ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు. ఈ మేరకు అందరూ కూడా కోవిన్ యాప్ ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ కూడా కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
Karnataka will procure 1 Crore doses of COVID-19 vaccine as we begin to inoculate citizens between 18 to 44 years from May 1. ₹400 Crores has been earmarked for this in the 1st phase. I urge all those above 18 to register themselves for the vaccine starting from April 28.
— B.S. Yediyurappa (@BSYBJP) April 22, 2021