AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deviramma Temple: కొండ శిఖరం మీద అమ్మోరి గుడి.. ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు.. అప్పుడే ఏం జరిగిందంటే..

కొండ శిఖరం మీద అమ్మోరి గుడి.. అష్టకష్టాలు పడి అయినా, ఆ గుడికి వెళ్లాలని భక్తుల తాపత్రయం. ప్రాణాలకు తెగించి గుట్టలు, లోయలు దాటేస్తారు.. నిలువెత్తు కొండలైనా ఎక్కేస్తారు..! కర్నాటకలో వేల మంది భక్తులు ఇలాంటి సాహసమే చేశారు. ఐతే.. విపరీతమైన రద్దీ, రిస్కుతో కూడిన వాతావరణం వల్ల ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది.

Deviramma Temple: కొండ శిఖరం మీద అమ్మోరి గుడి.. ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు.. అప్పుడే ఏం జరిగిందంటే..
Deviramma Temple
Shaik Madar Saheb
|

Updated on: Nov 01, 2024 | 9:22 PM

Share

చీమల దండు.. కొండ మీదకు దండయాత్ర చేస్తున్నట్లున్న దృశ్యాలు. కొండపై కొలువున్న దేవిరమ్మ దర్శనం కోసం భక్తుల దండు ఇలా కదిలింది. విశ్వాసం పర్వతాలను కదిలిస్తుందంటారు. నమ్మకం ఆ పర్వతాలను కూడా అధిగమించేలా చేస్తుందనడానికి ఇదే సాక్ష్యం. కర్నాటకలో వేల మంది భక్తులు ఇలాంటి సాహసమే చేశారు. కొండంత రిస్క్‌ తీసుకుని మరీ అమ్మోరి కొండ ఎక్కారు. ఐతే.. విపరీతమైన రద్దీ, రిస్కుతో కూడిన వాతావరణం వల్ల ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. నిట్టనిలువుగా ఉండే కొండ శిఖరం. వెళ్లడానికి సరైన మార్గం లేదు. అయినా అష్టకష్టాలు పడి భక్తులు కొండ ఎక్కారు. అమ్మవారి దర్శనం కోసం ఈ కష్టాలన్నీ పడ్డారు. కర్నాటక లోని చిక్క మగళూరు మాణిక్యధార కొండపై కొలువున్న దేవిరమ్మ దర్శనం కోసం భక్తులు, భారీ సంఖ్యలో కొండకు పోటెత్తారు. ఆ క్రమంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఎప్పుడో రాజుల కాలంలో కట్టిన మెట్లు. అవి కూడా దాదాపుగా శిథిలమై పోయి ఉన్నాయి. ఎక్కండి చూద్దాం అంటూ భక్తులను ఛాలెంజ్‌ చేస్తున్న మెట్లు. అవి కూడా నిట్టనిలువుగా ఉన్నాయి. వాటిని చూస్తే ఎవరైనా సరే బేజారెత్తి పోవాల్సిందే. అయితే భక్తి ముందు అన్నీ బలాదూర్‌. తాళ్లు పట్టుకుని కొండ పైకి భక్తులు ఎగబాకారు. కాలు తీసి కాలు వేస్తే, జర్రున జారిపోవడం ఖాయం. కాలు జారిందా, పక్కనే ఉన్న లోయలో పడతారు. కొండ పైకి వెళ్లే, దారి బురదమయంగా ఉంది. అయినా సరే, భక్తులు ప్రాణాలకు తెగించి కొండను ఎక్కారు.

వీడియో చూడండి..

10 మంది భక్తులకు గాయాలు..

మాణిక్యధార కొండకు వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పర్వత శిఖరం మీద కొలువైన దేవిరమ్మ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు కొండ ఎక్కడానికి ప్రయత్నించారు. పరిమితికి మించి భక్తులు కొండ పైకి రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. 10 మంది భక్తులు కొండపై నుంచి జారిపడ్డారు. ఊపిరి ఆడక ఓ భక్తురాలు.. తీవ్ర అస్వస్థతకు గురైంది. తాళ్ల సాయంతో ఆ మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ఏడాది పొడవునా ఖాళీగా ఉండే…ఈ ఆలయం, ఒక్క రోజు మాత్రం భక్తులతో ఇలా కిటకిటలాడిపోతుంది. ఏడాదికి ఒకసారి మాత్రమే చిక్కమగళూరు తాలూకాలోని మాణిక్యధార దేవీరమ్మ కొండపై దర్శనానికి అనుమతిస్తారు. దీంతో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. భక్తుల రద్దీ నేపథ్యంలో, పోలీసులు అప్రమత్తమయ్యారు. సహాయ చర్యల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..