Oscar Fernandes: కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెస్ కన్నుమూత.. మంగళూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ఆస్కార్ ఫెర్నాండెస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.
Senior Congress Leader Oscar Fernandes: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు ఆస్కార్ ఫెర్నాండెస్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. మంగళూరు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల ఆస్కార్ ఫెర్నాండెజ్ గత జూలై నుంచి కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఎనెపోయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు డయాలసిస్ చికిత్స చేస్తుండగా ఓసారి బాగా తలనొప్పి రావడంతో ఆయనకు పలు పరీక్షలు నిర్వహించారు. ఆయనకు శరీర అంతర్గత అవయవాల్లో గాయాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ఏడాది జూలైలో తన ఇంటి వద్ద యోగా చేస్తున్నప్పుడు ఫెర్నాండెజ్ పడిపోవడంతో ఆసుపత్రిలో చేరారు. అతని మెదడులోని గడ్డను తొలగించడానికి శస్త్రచికిత్స తర్వాత ఐసియులో చేర్చారు. దీనికి చికిత్స తీసుకుంటుండగా ఆయన కన్నుమూశారు.
We are deeply saddened by the demise of Shri Oscar Fernandes ji, our heartfelt condolences to his family.
A Congress stalwart, his vision for an inclusive India had a huge influence on the politics of our times.
The Congress family will deeply miss his mentorship & guidance. pic.twitter.com/UXcLI765yP
— Congress (@INCIndia) September 13, 2021
ఆస్కార్ ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న బోర్డ్ హైస్కూల్‌లో ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్ ప్రఖ్యాతిపొందిన హెడ్ మాస్టర్. ఆయన తల్లి లియోనిసా ఫెర్నాండెజ్. ఉమ్మడి దక్షిణ కనర జిల్లాకు ఆమె మొట్టమొదటి బెంచ్ మెజిస్ట్రేట్. సెయింట్ సీసిలీస్ కాన్వెంట్ స్కూల్లో విద్యను అభ్యసించిన ఆస్కార్ ఆ తర్వాత ఎంజీఎం కాలేజీలో చదువుకున్నారు.
కొంతకాలం ఎల్ఐసీలో ఉద్యోగం చేసిన అస్కార్ ఆ తర్వాత మణిపాల్‌లో వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలం వ్యవసాయం కూడా చేశారు. ఉత్తమ వరి ఉత్పత్తిదారుడి అవార్డు కూడా అందుకున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆస్కార్ ఆ తర్వాత రాజకీయాల వైపు మళ్లారు. ‘జాలీ క్లబ్’ను స్థాపించి యువతలో చదువు పట్ల ఆసక్తి పెంచేందుకు రీడింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. 1980 లో కర్ణాటకలోని ఉడిపి నియోజకవర్గం నుండి ఆస్కార్ ఫెర్నాండెజ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 1984, 1989, 1991, 1996 లో లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యారు. 1998 లో ఫెర్నాండెజ్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004 లో ఎగువ సభకు తిరిగి ఎన్నికయ్యారు. ఫెర్నాండెజ్ యుపీఏ ప్రభుత్వంలో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా ఉన్న ఫెర్నాండెజ్, రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా కూడా పనిచేశారు. Read Also… కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో కూలీలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు!