కేంద్ర ప్రభుత్వానికి కర్నాటకకు చెందిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఇపి) ప్యానెల్ కొత్త సలహా ఇచ్చింది. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు, మాంసం తీసుకోవడం వల్ల విద్యార్థుల్లో జీవనశైలి లోపాలు తలెత్తుతాయని పేర్కొంది. కర్నాటక విద్యా విధాన ప్యానెల్ సమర్పించిన పొజిషన్ పేపర్‌లో మధ్యాహ్న భోజనంలో గుడ్లు, మాంసాన్ని తొలగించాలని సూచించింది. ఈ ప్రతిపాదన లేఖలో, మనస్సు, భావోద్వేగాల మెరుగుదల కోసం సాత్విక ఆహారం తినాలని కూడా సిఫార్సు చేయబడింది. కొత్త జాతీయ విద్యా విధానం గురించి కేంద్రానికి సూచించాల్సిందిగా రాష్ట్రాలను కోరిన ప్రక్రియలో ఈ పొజిషన్ పేపర్ భాగం.
విధానంలో భాగంగా వాటిని అమలు చేయడానికి ముందు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ పేపర్‌లను సమీక్షిస్తాయి. పాఠశాల పాఠ్యాంశాలపై పేపర్ రెడీ చేసేందుకు 26 కమిటీలను ఏర్పాటు చేసింది కర్నాటక ప్రభుత్వం. ఈ కమిటీల్లో ఒక అధ్యక్షుడు, ఐదు నుంచి ఆరుగురు విద్యావేత్తలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం 26 కమిటీలు ఈ పేపర్ రెడీ చేశాయి. అన్ని కమిటీల అభిప్రాయం ఒకేలా ఉండటం విశేషం.
ఆఫర్ లెటర్‌లో ఏం చెప్పారంటే..
కర్నాటక ప్రభుత్వానికి “ఆరోగ్యం, శ్రేయస్సు” అనే పేరుతో పేపర్ రెడీ చేశారు. భారతీయుల జీవన చక్రంలో గుడ్లు, మాంసం సాధారణ వినియోగం నుంచి కొలెస్ట్రాల్ అనేవి విద్యార్థుల జీవనశైలిలో అనారోగ్యకారణంగా మారుతున్నాయని సూచించింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌లో చైల్డ్ అండ్ అడోలసెంట్ సైకియాట్రీ విభాగం అధిపతి కె జాన్ విజయ్ సాగర్ ఈ ప్రతిపాదన లేఖకు కమిటీ అధ్యక్షత వహించారు.
పిల్లలకు గుడ్లు, బిస్కెట్లు..
జంతు ఆధారిత ఆహారాల వల్ల భారతదేశంలో మధుమేహం, ప్రి డయాబెటిక్, ప్రాధమిక వంధ్యత్వం వంటి రుగ్మతలు వస్తున్నాయని ఈ కమిటీ తేల్చింది. “స్థూలకాయం, హార్మోన్ల అసమతుల్యత” నివారించడానికి పిల్లల ఆహారంలో గుడ్లు, బిస్కెట్లు దూరంగా ఉండాలని పేర్కొంది. పిల్లలందరినీ సమానంగా.. ‘పంటి బేధా’ (ఆహార వివక్షత) లేకుండా చూడటం ప్రామాణికమైన భారతీయ తత్వశాస్త్రంలో చెప్పినట్లుగా పేపర్‌లో పేర్కొంది కమిటీ.
అమ్మమ్మ వంటలు..
ధర్మం, అర్థ, కామ, మోక్షం అనే నాలుగు జీవిత లక్ష్యాలను సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలని ఈ కమిటీ పేర్కొంది. ధర్మం, శ్రేయస్సు, ఆనందం, విముక్తి అనే నాలుగు గుణాలు మానవజాతి లక్ష్యం కావాలి. ఆహారం మంచిదో చెడ్డదో గుర్తు చేసే పట్టికను కూడా తయారు చేశారు. ఉదాహరణకు.. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, మాంసం తినడం ఆరోగ్యానికి హనికరం అని వర్ణించబడింది. అయితే అమ్మమ్మ పద్ధతిలో బడి పిల్లలకు మిడ్ డే మీల్స్ అందించడం మంచిదని వర్ణించబడింది.