కర్నాటక కాంగ్రెస్ ప్రచారంలో అన్నీ తామై నడిపించారు రాహుల్, ప్రియాంక. బెంగళూర్‌లో రాహుల్ ప్రచారం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. బాంబే హైదరాబాద్ ప్రాంతంలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించింది.
కర్నాటక కాంగ్రెస్ విజయంలో ప్రతి ఒక్కరిది ఒకే మాట.. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర తోనే ఈవిజయం సాధమయ్యిందని కాంగ్రెస్ నేతలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కర్నాటకలో ఏడు జిల్లాల్లో 20 నియోజకవర్గాల మీదుగా రాహుల్ జోడో యాత్ర సాగింది. అందులో 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారంలో రోడ్‌షోలు నిర్వహించారు. అయితే స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లకే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బెంగళూర్‌లో రాహుల్ ప్రచారం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలకపాత్ర పోషించారు ప్రియాంకాగాంధీ. ఎన్నికల్లో విజయంపై హర్షం వ్యక్తం చేశారు ప్రియాంక. ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చే రాజకీయాలను దేశ ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు ప్రియాంక. నిరుద్యోగం ,అవినీతి,అధికధరల విషయంలో బీజేపీకి గుణపాఠం చెప్పారని అన్నారు. విజయపుర లాంటి బీజేపీకి పట్టున్న ప్రాంతాల్లో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. బాంబే-కర్నాటక ప్రాంతంలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్‌కు తిరుగులేని ఆధిక్యతను ఇచ్చింది.
కర్నాటక అసెంబ్లీ ఫలితాల వేళ హిమాచల్ పర్యటనలో ఉన్నారు ప్రియాంక. హిమాచల్ ఎన్నికల్లో కూడా ప్రజాసమస్యలను మాత్రమే ప్రస్తావించి కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. ఈ ఎన్నికలు దేశానికి కొత్త దిశను సూచించాయన్నారు. ఇక సిమ్లాలో ప్రియాంకకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. అంతకుముందు సిమ్లా లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..