
చావోరేవోగా భావించిన కర్నాటక ఎన్నికల్లో ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉంటే.. ఈ ఎలక్షన్స్ ద్వారా AICC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు పెద్ద ఊరట దక్కిందనే చెప్పాలి. మల్లికార్జున ఖర్గేకు కర్నాటక సొంత రాష్ట్రం. పార్టీ పరంగా తప్పక గెలవాల్సిన రాష్ట్రం ఒకటైతే.. సొంత రాష్ట్రంలో ఖర్గే ప్రభావం చూపగలరా..? వర్గాలుగా విడిపోయిన నేతలను ఒక్కతాటిపైకి తీసుకురాగలరా అనే ప్రశ్నలు ఉదయించాయి. వాటికి తాజా ఫలితాలు సమాధానం చెప్పకనే చెప్పాయి. మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గత ఏడాది అక్టోబరులో పగ్గాలు చేపట్టారు. ఆ సమయంలో దేశంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఉంది. నవంబరులోనే హిమాచల్ ప్రదేశ్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో స్పష్టమైన మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఖర్గేకు బూస్ట్ ఇచ్చినట్టు అయ్యింది. తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయినా.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బంది పడినా.. ఖర్గే డీలా పడలేదు. తన ఫోకస్ అంతా సొంత రాష్ట్రమైన కర్నాటకపై పెట్టారు.
కర్నాటక ప్రజల మూడ్ ఎలా ఉంటుందో..? అక్కడ ఏ అంశాలు ప్రజలపై ప్రభావం చూపుతాయో మల్లికార్జున ఖర్గేకు బాగా తెలుసు. పైగా కర్నాటకలో వరుసగా తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు నెలకొల్పిన చరిత్ర ఖర్గేకు ఉంది. అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా చేశారు. పీసీసీ అధ్యక్షుడిగానూ ఓసారి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ అనుభవానికి తోడు AICC అధ్యక్షుడిగా ఇప్పుడు అసలు సిసలు పరీక్షను సమర్ధవంతంగా ఫేస్ చేశారనే చెప్పాలి.
మరిన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వార్తలు చదవండి..