చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌

ఓ ఇండస్ట్రియల్‌ ఏరియాలో గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం పెద్ద సంఖ్యలో జనాలు చెత్త డంపింగ్‌ ప్రదేశానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నేలపై పడివున్న చాక్లెట్లను చేతులతో ఏరుకోగా, మరికొందరు బ్యాగులు, సంచులతో వచ్చి వాటిని నింపుకుని తీసుకెళ్లారు..

చెత్త కుప్పలో గడువు ముగిసిన చాక్లెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం! వీడియో వైరల్‌
Expired Chocolates Dumped In Kanpur

Updated on: Aug 25, 2026 | 8:04 PM

కాన్పూర్‌, ఆగస్ట్‌ 25: సాధారణంగా చెత్త కుప్పల వద్ద విలువైన వస్తువుల కోసం ప్రజలు వెతుకుతుంటారు. అయితే ఇక్కడ మాత్రం గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీల కోసం భారీ సంఖ్యలో జనం గుమిగూడటం చర్చనీయాంశంగా మారింది. కాన్పూర్‌లోని పాంకీ ఇండస్ట్రియల్‌ ఏరియాలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఈ వీడియోలో.. చెత్తను డంప్‌ చేసిన ప్రదేశానికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకోవడం కనిపిస్తోంది. కొందరు నేలపై పడివున్న చాక్లెట్లు, టాఫీలను చేతులతో ఏరుకుంటుండగా.. మరికొందరు ముందుగానే బ్యాగులు, సంచులు, ఖాళీ కంటైనర్లతో వచ్చి వాటిని నింపుకుని తీసుకెళ్లడం కనిపించింది.

ఓ ఫ్యాక్టరీ యజమాని గడువు ముగిసిన లేదా విక్రయించడానికి అనర్హమైన చాక్లెట్లు, టాఫీలను అక్కడ పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం స్థానికంగా వ్యాపించడంతో కొద్దిసేపటికే భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకుని వాటిని ఏరుకోవడం ప్రారంభించినట్లు చెబుతున్నారు. అయితే జనాలు వాటిని తినేందుకు తీసుకెళ్లడం గందరగోళానికి దారి తీసింది. గడువు ముగిసిన చాక్లెట్లు, టాఫీలు తీసుకెళ్లడం పట్ల ఆహార భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఎంతకాలం అక్కడ ఉంచారు? ఎలాంటి పరిస్థితుల్లో నిల్వ చేశారు? అవి పాడయ్యాయా? వంటి విషయాలపై స్పష్టత లేకపోవడంతో వాటిని తినడం ఆరోగ్యపరంగా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గడువు ముగిసిన, విక్రయించడానికి అనర్హమైన ఆహార పదార్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా నియంత్రిత పద్ధతిలో ధ్వంసం చేయాల్సిన అవసరం ఉందని ఆహార భద్రత పరిశీలకులు చెబుతున్నారు. బహిరంగంగా పడేయడం వల్ల అవి తిరిగి ప్రజల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న చాక్లెట్లు, టాఫీలు ఎప్పుడు, ఎలా అక్కడికి చేరుకున్నాయనే దానిపై స్వతంత్ర ధ్రువీకరణ లేదు. ఈ ఘటనపై స్థానిక అధికారులు లేదా ఆహార భద్రత శాఖ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే గడువు ముగిసిన ఆహార పదార్థాల సరైన విధంగా పారవేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి చర్చకు దారి తీసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us