కర్ణాటకలో భాషా వివాదం మరింత ముదిరింది. దుకాణాదారులు, ఇతర వ్యాపార సంస్థల సైన్ బోర్డులలో 60 శాతం వరకూ కన్నడ భాషనే వినియోగించాలన్న ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. కర్ణాటక రక్షణ వేదిక సభ్యుల దాడులు పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. అటు.. ఆందోళనకారుల తీరుపై ప్రభుత్వం సీరియస్ అయింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేదిలేదంటూ వార్నింగ్ ఇచ్చింది.
కర్ణాటకలో వెలుగు చూసిన భాషా వివాదం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ’60 శాతం కన్నడ’ పేరుతో ఓ ఉద్యమం తెరమీదికి వచ్చింది. కర్నాటకలో వ్యాపారాలు నిర్వహించేవారు.. దుకాణాల ముందు ఇంగ్లీష్‌లో సైన్ బోర్డుల ఏర్పాటు చేయడంతో కన్నడ భాష అంతరించే ప్రమాదం ఉందంటూ కర్ణాటక రక్షణ వేదిక ఆందోళనలకు దిగింది. వాణిజ్య వ్యాపార సంస్థల సైన్ బోర్డులపై ’60శాతం కన్నడ’ అక్షరాలే ఉండాలన్న నిబంధనను అమలు చేయాలని పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే.. నేమ్ బోర్డుల విషయంలో టీఏ నారాయణగౌడ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అయితే.. బెంగళూరులో కర్ణాటక రక్షణ వేదిక నిర్వహించిన ర్యాలీలు ఉద్రిక్తతకు దారితీశాయి. కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్‌తోపాటు పలు ప్రాంతాల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. హోటళ్లు, దుకాణాలపై ఆంగ్లంలో ఉన్న సైన్‌బోర్డులను తొలగించి విధ్వంసం సృష్టించారు. కన్నడలో సైన్‌బోర్డులకు సంబంధించి బెంగళూరు నగర పాలక సంస్థ ఇచ్చిన ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక.. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఆయా ఘటనల్లో పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రక్షణ వేదిక నేతలను అరెస్ట్ కోర్టులో హాజరుపర్చగా.. 14 రోజుల రిమాండ్ విధించింది.
కర్ణాటక రక్షణ వేదిక ఆందోళనల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ఆయన.. కర్నాటకలో సైన్ బోర్డులు, నేమ్‌ప్లేట్లలో 60 శాతం కన్నడలో ఉండాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఫిబ్రవరిలోగా మార్పులు చేయాలని షాపుల యజమానులను ఆదేశించామని చెప్పారు. ఉత్తర్వులు అమలయ్యేందుకు ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకొస్తామని తెలిపారు. అయితే.. రెచ్చిపోయి వ్యవహరిస్తే సహించేదిలేదన్నారు సీఎం సిద్ధరామయ్య. ఇక.. కన్నడ పరిరక్షణ పేరిట ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ఉపేక్షించబోమన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. రాష్ట్ర భాషను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కన్నడ కోసం పోరాడుతోన్న వారికి తాము వ్యతిరేకం కాదు.. వారిని గౌరవిస్తాం.. కానీ.. విధ్వంసానికి పాల్పడితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. అంతేకాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన వ్యక్తం చేయొచ్చు.. నల్ల జెండాలతో ఆందోళన చేయొచ్చు.. ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలని కోరవచ్చు.. కానీ.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమని హెచ్చరించారు.
మొత్తంగా.. కర్నాటకలో నేమ్‌బోర్డులపై 60 శాతం కన్నడ భాష ఉండాలంటూ బెంగళూరు మున్సిపల్ అధికారులు గత వారం జారీ చేసిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి మరోసారి సమర్థించినట్లయింది. అయితే.. కన్నడ భాషా ఉద్యమం.. జిల్లాలు, రూరల్ ప్రాంతాలకు విస్తరిస్తుండడంతో పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయో చూడాలి మరి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..