Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల బస్తాలు.. సుప్రీంకోర్టు సంచలన వీడియో రిలీజ్..!

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం తరువాత దొరికిన నగదు కట్టలపై సుప్రీం కోర్టు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదికలో సగం కాలిన నోట్ల కట్టలు, ఘటనా స్థలం వీడియోలు ఉన్నాయి. అయితే జస్టిస్ వర్మ మాత్రం తనపై ఆరోపణలను ఖండించారు.

Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో కాలిన నోట్ల బస్తాలు.. సుప్రీంకోర్టు సంచలన వీడియో రిలీజ్..!
Fire Accident

Updated on: Mar 23, 2025 | 9:46 AM

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భారీగా నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ సమర్పించిన నివేదికను సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ నివేదకలో సగం కాలిన నోట్ల కట్టలు గుర్తించినట్లు పేర్కొన్నారు. అలాగే ఘటనా స్థలంలో తీసిన వీడియోలు, ఫొటోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టారు. తనపై వచ్చిన ఆరోపణలపై జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణ కూడా ఇచ్చారు, అది కూడా నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ముగ్గురు హైకోర్టు నాయమూర్తులతో కూడిన త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

ఇందులో పంజాబ్‌-హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శీల్‌ నాగు, హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్‌. సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. కాగా, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దాదాపు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని జస్టిస్ డీకే ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.

ఆ డబ్బు మాది కాదు..

తనపై వచ్చిన ఆరోపణలను జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ ఖండించారు. మరోవైపు స్టోర్‌ రూంలో తానుగానీ, కుటుంబ సభ్యులు ఎటువంటి నగదును ఉంచలేదని సీజే జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. కుటుంబ సభ్యులు, తన సబ్బందికి ఎవరూ నగదును చూపించలేదన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని భార్యతో కలిసి మధ్యప్రదేశ్‌కు వెళ్లినట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.